రిపోర్టింగ్‌లో అంతరాయం: ‘దోషి’ ఎవరంటే..?

సీరియస్‌గా సాగుతున్న లైవ్‌ రిపోర్టింగ్‌కు ఒకరు అడ్డొచ్చారు. విలేకరి ఏకాగ్రతకు రెండుసార్లు భంగం కలిగించారు.

Published : 20 Dec 2020 22:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సీరియస్‌గా సాగుతున్న లైవ్‌ రిపోర్టింగ్‌కు ఒకరు అడ్డొచ్చారు. విలేకరి ఏకాగ్రతకు రెండుసార్లు భంగం కలిగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సదరు విలేకరి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఐతే ఆ దుండగుడి చేష్టలు రెండు రోజులు కూడా కాకుండానే 2.2 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. అదేంటీ అనుకుంటున్నారా.. ఆ ‘దోషి’ ముద్దొచ్చే ఓ పిల్లికూన మరి!

ఆడుకోవాలనే సరదా పుట్టిందంటే పిల్లి పిల్లలు సమయం, సందర్భం చూడవు. అవి ఉన్నచోట ఎవరున్నా పట్టించుకోవు. ఇదే విధంగా ఓ పిల్లి కూన చేసిన అల్లరిని లెబనాన్‌ రాజధాని బీరుట్‌కు చెందిన ఓ విలేకరి షేర్‌ చేయగా.. సదరు వీడియో నెట్టింట్లో చిరునవ్వులు పూయిస్తోంది. ఇంతకీ దానిలో ఏముందంటే.. లారిస్సా ఎవౌన్‌ అనే విలేకరి ఓ టీవీ ఛానెల్‌కు లైవ్‌ రిపోర్టింగ్‌  చేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ పిల్లి పిల్ల ఆమె ధరించిన కోటుకు ఉన్న బెల్టుతో ఆడటం మొదలుపెట్టింది. ఈ విధంగా అది రెండు సార్లు అంతరాయం కలిగించింది.
ఆ పిల్లి కూన అల్లరిని ‘‘నా అత్యంత నమ్మకమైన ఫాలోవర్‌..’’ అనే క్యాప్షన్‌తో లారిస్సా షేర్‌ చేశారు. దాని సందడికి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. ఇదే పరిస్థితి మధ్యాహ్నం లైవ్‌ కార్యక్రమంలో కూడా కొనసాగిందంటూ ఆమె మరో వీడియోను షేర్‌చేశారు. అయితే ముద్దొచ్చే పిల్లిపిల్ల సరదా చేష్టల వల్ల అంతరాయం కంటే ఎక్కువగా వినోదమే లభించిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ పిల్లి కూన సందడేంటో మీరూ చూసేయండి..

ఇవీ చదవండి

తాబేళ్ల సునామీ..!

ఆ ఐదు చుక్కలు చూపించాయి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని