ఏడాది పాటు కొన‘సాగిన’ ప్రయాణం

మహారాష్ట్రలో ఏడాది క్రితం బయలుదేరిన ఓ భారీ ట్రక్కు, ఎట్టకేలకు కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకుంది.

Published : 20 Jul 2020 19:08 IST

కేరళకు చేరుకున్న జంబో ట్రక్కు

తిరువనంతపురం: మహారాష్ట్రలో ఏడాది క్రితం బయలుదేరిన ఓ భారీ ట్రక్కు, ఎట్టకేలకు కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకుంది. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి ‘ఏరోస్పేస్‌ హారిజాంటల్‌ ఆటోక్లేవ్‌’ అనే యంత్రాన్ని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రానికి తరలించాల్సి వచ్చింది. కాగా, ఈ భారీ యంత్రం 70 టన్నుల బరువు, 7.5 మీటర్ల ఎత్తు, 6.65 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ముఖ్యంగా ఎత్తు ప్రతిబంధకంగా మారటంతో.. ఇతర మార్గాల ద్వారా దీని తరలింపు అసాధ్యమైందని అందుకే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నట్టు అధికారులు వివరించారు.  

ఈ యంత్రంతో కూడిన ట్రక్కు నాసిక్‌లో జులై 2019న బయలుదేరి, ఈ ఉదయానికి తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. 74 చక్రాలున్న ఈ భారీ ట్రక్కు నాలుగు రాష్ట్రాలను దాటుకుని 1500 కిలోమీటర్లు ప్రయాణించినట్టు వారు వివరించారు. ఈ ట్రక్కు 32 మంది సిబ్బందితో ప్రయాణించిందని.. ఎలాంటి ప్రమాదం జరుగకుండా జాగ్రత్తగా తీసుకొని వచ్చేందుకు ఇంత సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు. సాధారణ రోడ్లపై ప్రయాణం కష్టమైనందు వల్ల, ఈ జంబో ట్రక్కు రోజుకు కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిందని వారు వెల్లడించారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ ప్రభావం కూడా ఆలస్యానికి కారణమన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని