Published : 14/12/2020 01:53 IST

ఇంట్లో ఉంటే వీల్‌ఛైర్‌గా.. బయటకెళ్తే బైక్‌గా..!


ఇంటర్నెట్‌ డెస్క్‌: పుట్టుకతో లేదా ఏదైనా ప్రమాదం కారణంగా అంగవైకల్యం ఏర్పడి నడవలేని స్థితి ఉన్న వారి జీవితం సాధారణంగా చక్రాల కుర్చీకే పరిమితం అవుతుంటుంది. అలాంటి వారు తమ పనుల కోసం చాలావరకు ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. కానీ.. అన్ని సమయాల్లోనూ వారికి సహాయం చేసేందుకు ఇతరులు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి దివ్యాంగుల కోసమే చక్రాల కుర్చీ స్థానంలో.. న్యూ బోల్ట్‌ వీల్‌ ఛైర్‌ను అందుబాటులోకి తెచ్చింది ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఓ మిత్రబృందం. దివ్యాంగులకు చక్రాల కుర్చీ బలమవ్వాలే కానీ.. బలహీనం కాకూడదని భావించింది ఆ బృందం. అందుకోసమే.. ఆధునిక సాంకేతికతతో న్యూ బోల్డ్‌ వీల్‌ ఛైర్‌ను రూపొందించి అందరి మన్ననలు అందుకుంటోంది. ఆ వివరాలేంటో మీరూ చూసేయండి... 

ఐఐటీ మద్రాస్‌కు చెందిన సౌరభ్‌ మిత్రులతో కలిసి న్యూ మోషన్‌ అనే అంకుర సంస్థను స్థాపించారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి సరికొత్త సాంకేతిక పరికరాలు తక్కువ ధరలో అందించాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. మొదటగా ఆధునిక సాంకేతికతతో కూడిన చక్రాల కుర్చీలను మార్కెట్‌లోకి తీసుకురావాలని అనుకున్నారు. అందుకోసం దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వందల రకాల చక్రాల కుర్చీల గురించి అధ్యయనం చేశారు. వాటిని వాడుతున్న వారి అనుభవాలు, అవసరాల గురించి తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే రెండు ప్రధాన సమస్యలను గుర్తించారు. అందులో ఒకటి.. అందరూ ఒకే పరిమాణంలో గల పెద్దసైజు చక్రాల కుర్చీలను ఉపయోగించటం. ఇది ఒకే సైజు పాదరక్షలను అందరూ వినియోగించటం లాంటిది. ఇప్పటి వరకూ ఉన్న చక్రాల కుర్చీలు బయట దూర ప్రాంతాలకు వెళ్లటానికి అంతగా అనుకూలం కావు. ఇంట్లో అవసరాలకే ఉపయోగపడుతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు న్యూ బోల్డ్‌ వీల్‌ఛైర్‌ను రూపొందించారు. ఇంట్లో ఉన్నప్పుడు చక్రాల కుర్చీగా.. బయటకు వెళ్లినపుడు మోటరైజ్డ్‌ వాహనంగా దీనిని మార్చుకోవచ్చు. దీనిలో లిథియం ఆయాన్‌ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. నాలుగు గంటల పాటు ఛార్జ్‌ చేస్తే ఈ వీల్‌ఛైర్‌తో 30 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయవచ్చు.

చక్రాల కుర్చీకి ఇలాంటి ఏర్పాట్లు చేయటం వల్ల దివ్యాంగులకు ఎంతో ఉపయోగం అంటున్నారు న్యూమోషన్ సంస్థ సభ్యులు. వినియోగదారులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకు తగ్గట్టుగా దీనిని మార్చుకునే వీలుండటం అద్భుతమని చెబుతున్నారు. ఎవరిపై ఆధారపడకుండా పనులు చేసుకునేందుకు ఈ వీల్‌ఛైర్‌ దోహదపడుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ మోషన్‌ తీసుకువచ్చిన ఈ వీల్‌ఛైర్‌ వినియోగదారుల హృదయాలనేకాక .. నాస్కామ్‌ ఫౌండేషన్‌ అవార్డునూ గెలుచుకుంది. స్టార్టప్‌ ఇండియా పోటీల్లో రెండోస్థానం, అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ నిర్వహించిన కాంపిటీషన్‌లో ఉత్తమ డిజైన్‌ అవార్డును కైవసం చేసుకుంది. 2025 వరకు లక్షమంది దివ్యాంగులకు ఈ వీల్‌ఛైర్‌లు అందించటమే లక్ష్యంగా న్యూ మోషన్‌ అడుగులు వేస్తోంది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని