పండుగల వేళ మరింత జాగ్రత్త

ప్రజల సహకారంతోనే తెలంగాణలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్రీనివాస్‌, వైద్య విద్యా సంచాలకులు

Updated : 19 Oct 2020 10:27 IST

ప్రజారోగ్య, వైద్య సంచాలకుల సూచన

హైదరాబాద్‌: ప్రజల సహకారంతోనే తెలంగాణలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్రీనివాస్‌, వైద్య విద్యా సంచాలకులు రమేశ్‌ అన్నారు. ప్రస్తుతం బతుకమ్మ, మరి కొన్ని రోజుల్లో దసరా, దీపావళి, క్రిస్మస్‌ పండుగలు రాబోతున్నాయని.. కరోనా వైరస్‌ విషయంలో పండుగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ముందు నుంచి విజయవంతంగా కృషి చేసిన కేరళలో ‘ఓనం’ పండుగ తర్వాత తిరిగి కరోనా మళ్లీ విజృంభిస్తోందని వారు గుర్తుచేశారు. ‘పండుగలు ఏడాదికోసారి వస్తాయి కానీ, ప్రాణం చాలా విలువైంది. దాన్ని కాపాడుకోవాలి’ అని అన్నారు.

రాష్ట్రంలో 1500 కేసులు, జీహెచ్‌ఎంసీలో 250లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని శ్రీనివాస్‌, రమేశ్‌ వివరించారు. ప్రజల సహకారం వల్లే కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని.. అందుకే తిరిగి ప్రజల సహకారం కోరుతున్నామని వారు తెలిపారు. అందుకు కొన్ని ప్రచార పోస్టర్లను, రేడియో జింగిల్స్‌ను, యానిమేషన్స్‌ను తయారు చేయించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేరళ, దిల్లీలో నిబంధనలు పాటించకపోవడంవల్లే తిరిగి కరోనా వైరస్‌ విజృంభిస్తోందని వారు పేర్కొన్నారు. అక్టోబరు‌, నవంబరు‌, డిసెంబరు ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి పది లక్షల మందిలో లక్షా రెండు వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

గాంధీలో ప్రస్తుతం 350మంది రోగులే..

గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 350మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారంటే.. వైరస్‌ను ఏ స్థాయిలో కట్టడి చేస్తున్నామో అర్థం చేసుకోవాలన్నారు. కలుషిత ఆహారం, నీరు వల్ల వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలున్నాయని.. నీరు, ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చేందుకు మరో మూడు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. టీకా అందుబాటులోకి వస్తే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌లో ఎవరికి ముందు ఇవ్వాలన్న  ప్రాధాన్యతను తయారు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల ప్రొటోకాల్స్‌ పూర్తయిన తర్వాతనే వ్యాక్సిన్‌ అందజేస్తామని వారు స్పష్టం చేశారు. 

‘‘ప్రభుత్వం, ఆరోగ్య శాఖ చేపట్టిన కొవిడ్‌ నివారణ చర్యలను ప్రజలు తూచా తప్పకుండా పాటించారు. దీనివల్లనే కేసులను కట్టడి చేసుకోగలిగాం. కోటి జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో మనకి కేవళం 250 లోపు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అదేవిధంగా వందకు పైగా కేసులు రాష్ట్రంలోని మూడు, నాలుగు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. జనసమూహం ఉన్న చోటే వైరస్‌ విజృంభణకు అవకాశం ఎక్కువగా ఉంది. 70శాతం పైగా ఎలాంటి లక్షణాలు లేనివాళ్లు ఉంటారు. వాళ్లంతా మనమధ్యలోనే, మనతోనే ఉంటారు. వారి ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. 

‘‘ముఖ్యంగా ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తుంటారు. అప్పుడు అందరూ ఒకే చోటుకు చేరుతారు. అలాంటి సమయంలో అందులో ఎవరికైనా వైరస్‌ ఉంటే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆరోగ్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కొవిడ్‌ పరీక్షలు చేయడం జరుగుతోంది. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నాం. పాజిటివ్‌ కేసుకు దగ్గర వ్యక్తులను కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నాం. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. అందుకని పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి కూడా కరోనా విషయంలో ఎలాంటి ప్రమాదం ఉండదని’’ వైద్య, విద్య సంచాలకులు రమేశ్‌ రెడ్డి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని