శశి థరూర్‌కే ఇంత ఇంగ్లీష్‌ తెలియదట..

కేరళకు చెందిన ఓ పదో తరగతి బాలిక శశి థరూర్‌కే తెలియని ఇంగ్లీషును పరిచయం చేసింది.

Updated : 08 Nov 2020 13:49 IST

అదరగొట్టిన పదో తరగతి బాలిక!

ఇంటర్నెట్‌ డెస్క్‌: లండన్‌లో పుట్టి, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ మాట్లాడినపుడు పెద్ద పెద్ద వాళ్లే ఇంగ్లీషు డిక్షనరీలను తిరగేస్తారు. ఎప్పుడూ కనీ విని ఎరుగని క్లిష్టమైన పదాలతో కూడిన ఆయన శైలిని, భాషా నైపుణ్యాన్ని పలువురు ప్రముఖులతో సహా ఎందరో మెచ్చుకుంటారు. అరుదైన పదాలతో కూడిన ఆంగ్ల పదసంపద ఆయన సొంతం. అయితే కేరళకు చెందిన ఓ పదో తరగతి బాలిక ఇంతటి విద్యావేత్తకు తెలియని ఇంగ్లీషును పరిచయం చేసింది. ఇడుక్కికి చెందిన దియా మాటలకు ఆ సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు.

ఓ అతి పొడవైన ఆంగ్ల పదాన్ని పలకాలని దియా ఇదివరకు సామాజిక మాధ్యమాల ద్వారా శశి థరూర్‌ను కోరిందట. కాగా, ఆమె ఇటీవల తన ఇంగ్లీషు భాషా నైపుణ్యాన్ని ఓ ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమంలో ప్రదర్శిస్తున్న సమయంలో.. థరూర్‌ హఠాత్తుగా ఆన్‌లైన్లో హాజరై ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా దియా మరోసారి ఆ టంగ్‌ ట్విస్టర్‌ (కఠినపదం)ను తడబడకుండా, గుక్కతిప్పుకోకుండా, ఆపకుండా ఏకరువు పెట్టగా .. తను అలా చేయలేనంటూ శశి థరూర్‌ ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఇంతకీ దాని అర్థం ఏంటని ప్రశ్నించిన ఈ సీనియర్‌ నేతకు.. అది ఓ కల్పిత ఆహార పదార్థం పేరని నవ్వుతూ బదులిచ్చింది దియా.

ఆ పదాన్ని గుర్తుంచుకుని మళ్లీ చెప్పడానికి అది చిన్న పదమేమీ కాదని,  దానిని అందరూ చెప్పలేరని థరూర్‌ అభిప్రాయపడ్డారు. బాలిక జ్ఞాపకశక్తి, ఏకాగ్రత  అమోఘమని.. అయితే నిత్యజీవితంలో ఉపయోగించే అతిపెద్ద పదాలను నేర్చుకోవాలని ఆమెకు సలహా ఇచ్చారు. ‘‘నేను ఎప్పుడూ వినని, నాలుకను మెలితిప్పే ఇంగ్లీష్‌ టంగ్‌ట్విస్టర్‌లను స్వంతం చేసుకున్న తెలివైన పదో తరగతి విద్యార్థిని అద్భుతమైన కథ.’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. దానికి ఈ సంఘటనకు సంబంధించిన వీడియో లింక్‌ను జతచేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో, యువతలో విపరీతంగా ప్రచారమౌతోంది. దియా ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పరిశ్రమ అమోఘమని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ పదం ఏదో  తెలుసుకోవాలంటే ఆ వీడియో మీరూ చూసేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని