టీ పాట్‌తో జాక్‌పాట్..!

ఎవరికైనా ఊరికే ఇచ్చేద్దామని మొదట అనుకున్నానని ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పారు!

Published : 11 Sep 2020 01:40 IST

లాక్‌డౌన్‌లో అదృష్టం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఇంటికే పరిమితం అయ్యారు. అలా తన ఇంటిని శుభ్రం చేసుకుంటున్న ఓ వ్యక్తిని అదృష్టం అనుకోని విధంగా తలుపుతట్టింది. కేవలం 15 సెంటీమీటర్ల పొడవున్న ఓ టీ పాట్‌.. అతనికి లక్ష పౌండ్లు అంటే సుమారు రూ.95 లక్షలు తెచ్చిపెట్టింది.

బ్రిటన్‌లోని డెర్బీషైర్‌కు చెందిన ఓ 51 ఏళ్ల వ్యక్తి లాక్‌డౌన్‌ కారణంగా తీరిక చిక్కడంతో షెడ్డును శుభ్రం చేద్దామనుకున్నాడు. ఇంతలో అతనికి ఓ పాత టీపాట్‌ కనపడింది. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో అచ్చం ఇలాంటిదే ఒక దాన్ని చూసినట్టు గుర్తుకు రావటంతో.. హాన్పన్‌ అనే ప్రముఖ వేలం సంస్థకు తెలియచేశాడు. వారు దీనిని 18వ శతాబ్దంలోని చైనా చక్రవర్తి క్విన్‌లాంగ్‌ ఆ స్థానానికి చెందిన వైన్‌ జాడీగా గుర్తించారు. దీనిపై ఆయన రాజచిహ్నం కూడా ఉండటం విశేషం. ఇంచుమించు దీని మాదిరిగానే ఉండే మరో రెండు ఒకటి తైవాన్‌లోని నేషనల్‌ పేలస్‌ మ్యూజియంలో ఉండగా.. మరొకటి చైనా, బీజింగ్‌లోని పేలస్‌ మ్యూజియంలో ఉంది. వీటిని ప్రత్యేక సందర్భాలలో చక్రవర్తికి వెచ్చటి వైన్‌ను అందించేందుకు వాడేవారట.

ఈ టీపాట్‌, తనకు గుర్తున్న నాటి నుంచి తమ ఇంట్లోనే ఉందని దాని యజమాని చెప్పారు. ఈయన తాత రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారట. బహుశా అయన వద్దనుంచి తన తల్లికి వచ్చి ఉంటుందని అయన అంటున్నారు. ఇక తన తల్లితండ్రులు మరణించిన తర్వాత ఈ అపురూప వస్తువు ఇంటివెనుక షెడ్డులో చేరిందట. ఇంట్లోని ఇతర పనికిరాని సామాన్లతో పాటు దానిని కూడా ఎవరికైనా ఊరికే ఇచ్చేద్దామని మొదట అనుకున్నానని ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పారు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని