Electricity Smart Meter: డిస్కంలపై స్మార్ట్‌ కత్తి!

కరెంటు బిల్లు సక్రమంగా కట్టని వినియోగదారులతో సహా డిస్కంలకు చెక్‌ పెట్టేందుకు

Updated : 31 Aug 2021 12:49 IST

 ప్రతి కనెక్షన్‌కూ ప్రీపెయిడ్‌ మీటరు తప్పనిసరని కేంద్రం షరతు
 1.37 కోట్ల మీటర్ల కొనుగోలు ఖర్చు రూ.13,762 కోట్లుగా అంచనా
 నిధులు లేవని చేతులెత్తేస్తున్న డిస్కంలు

ఈనాడు, హైదరాబాద్‌: కరెంటు బిల్లు సక్రమంగా కట్టని వినియోగదారులతో సహా డిస్కంలకు చెక్‌ పెట్టేందుకు ‘ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల’(పీఎస్‌ఎం) వ్యవస్థకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వీటిని తప్పనిసరిగా వినియోగదారుల ఇళ్లతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లకు కూడా బిగించాల్సిందేననే నిబంధనను తాజాగా విధించింది. ఇదే ఇప్పుడు డిస్కంలకు తలకుమించిన భారంగా మారింది.

కరెంటు ఎంత కొనుగోలు చేస్తున్నారు, వినియోగదారులకు ఏ మేరకు సరఫరా చేస్తున్నారు, వసూలైన బిల్లుల ప్రకారం ఎంత వినియోగానికి సంబంధించిన సొమ్ము వెనక్కి వచ్చిందనే లెక్కలు పక్కాగా తేలాలంటే పీఎస్‌ఎంలే శరణ్యమని కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలకు స్పష్టంచేసింది. ఏ డిస్కం పరిధిలోనైనా విద్యుత్‌ ‘సగటు సాంకేతిక, వాణిజ్య’(ఏటీసీ) నష్టాలు 30 శాతానికి మించి ఉంటే అక్కడ తప్పనిసరిగా పీఎస్‌ఎంలు పెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఆ ప్రకారం ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 2019-20లో ఏటీసీ నష్టాలు 34.49 శాతం ఉన్నాయి. అంతకుముందు ఏడాది (2019-20)తో పోలిస్తే ఈ నష్టాలు 26.66 నుంచి మరో 7.83 శాతం పెరగడం గమనార్హం. దక్షిణ తెలంగాణ డిస్కంలో ఏటీసీ నష్టాలు 15.41 శాతానికి చేరాయి. ఈ డిస్కం సగటు నష్టాల సంగతటుంచి, కొన్ని ప్రాంతాలను విడిగా చూసినప్పుడు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 25 నుంచి 30 శాతానికి పైగా నష్టాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా 15 శాతానికి మించి ఏటీసీ నష్టాలుంటే అక్కడున్న కనెక్షన్లన్నింటికీ తక్షణం స్మార్ట్‌మీటర్లు పెట్టాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇచ్చే కొత్త కనెక్షన్లన్నింటికీ స్మార్ట్‌ మీటర్లే బిగించాలని ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ) ఇప్పటికే డిస్కంలను ఆదేశించింది. ‘‘ఇంతకాలం ఏటీసీ నష్టాలు గృహ వినియోగదారుల పరంగా ఉన్నప్పటికీ, దానిని వ్యవసాయ వినియోగం పరిధిలో చూపుతున్నారు. ప్రీపెయిట్‌ స్మార్ట్‌మీటర్లు పెడితే వాస్తవాలు బయటపడుతాయని’’ ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు ‘ఈనాడు’కు చెప్పారు.

ఖర్చు భరించేదెలా?

నిజానికి ఒక్కో స్మార్ట్‌ మీటరు ఖరీదు కంపెనీ, సామర్థ్యం ఆధారంగా రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకూ ఉంది. ఒక్కోదాని ధరలో గరిష్ఠంగా రూ.900 తాము ఇస్తామని కేంద్రం తెలిపింది. మిగిలిన సొమ్ము డిస్కంలు భరించే పక్షంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటీ 37 లక్షల గృహ కనెక్షన్లకు వీటిని ఏర్పాటుచేయడానికి రూ.13,762 కోట్లు వ్యయమవుతుందని గుర్తించారు. అంత సొమ్ము తమ వద్ద లేదని రాష్ట్రంలోని రెండు ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లు చేతులెత్తేసినట్టు సమాచారం. అయితే..వీటి కొనుగోలుకు అప్పులు తీసుకోవచ్చని కేంద్రం చెప్పినందున ఏర్పాటు అనివార్యం కానుందని డిస్కంల వర్గాలు పేర్కొంటున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని