ప్రేమలో మోసపోయారా?.. ఈ టీ మీకోసమే!

మరి మనసు గాయపడినపుడు తాగే ప్రత్యేక టీ గురించి మీరెపుడైనా విన్నారా?

Published : 19 Dec 2020 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ అనేది కేవలం ఓ పానీయం అనేది మామూలు ప్రజల అభిప్రాయం. దాని అభిమానులకైతే అది ఓ భావావేశం. పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించాలన్నా.. స్నేహితులతో సరదా కబుర్లకైనా.. ఇంటికొచ్చిన అతిధులకు అందించాలన్నా తేనీరే మంచి ఎంపిక. ఇక టీ తాగటంతోనే మూడ్‌ పూర్తిగా మారిపోతుందని చాలామంది అంటారు. మరి మనసు గాయపడినపుడు తాగే ప్రత్యేక టీ గురించి మీరెపుడైనా విన్నారా?మధ్యప్రదేశ్‌  గ్వాలియర్‌ పట్టణం హనుమాన్‌ నగర్‌కు చెందిన ‘కాలూ బేవఫా’ అనే ఈ టీ స్టాల్‌ పేరే కాదు..   ఇక ఇక్కడ లభించే చాయ్‌ కూడా చిత్రవిచిత్రమైన పేర్లతో ఆసక్తికరంగా ఉంటాయి. తమ వద్ద ప్రతి మూడ్‌కీ తగిన చాయ్‌ లభిస్తుందని దీని యజమానులు భరోసా ఇస్తుంటారు. అవేంటంటే..

ప్రేమలో దెబ్బతిన్న వారి కోసం ఉద్దేశించిన ‘ప్యార్‌ మే ధోకా’ గీ ఖరీదు రూ.5 కాగా.. ఒంటరితనంలో తాగాల్సిన ‘అకేలాపన్‌’ టీ వెల రూ.20. అయితే అంతా విషాదమే కాకుండా ఆనందంగా ఉన్న జంటలకు సరిపడే తేనీరు కూడా ఇక్కడ లభిస్తుందట. ఉదాహరణకు ఇక్కడ రూ. 10 కి లభించే  ‘నయే ప్రేమీ కీ చాయ్‌’ కొత్తగా ప్రేమలో పడ్డవారికోసమైతే.. ఇష్టమైన వారి ప్రేమ పొందేందుకు ఉపయోగపడే ‘మన్‌ చాహా ప్యార్‌ పానే కీ చాయ్‌’ ఖరీదు అన్నిటికంటే అధికంగా రూ.49గా ఉంది.

మరి ఇక్కడ ఒక రకమైన టీ మాత్రం పూర్తి ఉచితంగా లభిస్తుందట.. మరి అదెవరికంటే భార్యాబాధితులకి అంటూ  నవ్వేస్తున్నారు. కాగా, వినియోగదారులను ఆకర్షించేందుకు వెరైటీ ఆలోచనతో ముందుకొచ్చిన ఈ టీ దుకాణంలో వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతోందనటంలో ఏ సందేహం లేదు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు