చూచిరాత పరీక్షల వైపు..విద్యాలయాల చూపు!

విద్యా సంస్థలకు పరీక్షల నిర్వహణ కూడా కత్తిమీద సాములా మారింది. దీన్ని అధిగమించేందుకు ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానాన్ని(ఓబీఈ) అమలుచేస్తున్నాయి.

Published : 22 Sep 2020 14:28 IST

‘ఓపెన్‌ బుక్‌ పరీక్షా’ విధానం వైపు మొగ్గు

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడింది. ఇప్పటికే తరగతి గదులకు దూరమైన విద్యార్థులు.. పరీక్షలకు దూరమవుతున్నారు. విద్యా సంస్థలకు పరీక్షల నిర్వహణ కూడా కత్తిమీద సాములా మారింది. దీన్ని అధిగమించేందుకు ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానాన్ని(ఓబీఈ) అమలుచేస్తున్నాయి. ఈ విధానంలో పుస్తకాలను చూసుకుంటూ పరీక్షలు రాసే వీలుంటుంది. తాజాగా దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు చివరి సంవత్సరం విద్యార్థుల పరీక్షల కోసం ఓపెన్‌ బుక్‌ విధానానికే మొగ్గు చూపుతున్నాయి.

దేశంలో పరీక్షల విధానంలో మార్పులు చేయాలనే ఆలోచనలో ఇప్పటికే దేశంలోని అన్ని యూనివర్సిటీలు సంస్కరణలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించేవారి పరీక్షల విధానంలో మార్పుల కోసం ఇప్పటికే కృషి జరుగుతోంది. తాజాగా కరోనా విజృంభణతో పలు విశ్వవిద్యాలయాల పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, సెమిస్టర్‌ తరగతులను మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న ఈ సమయంలో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో పలు యూనివర్సిటీలు ఓపెన్‌ బుక్‌ టెస్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, కొన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌ బుక్‌ పరీక్షలను అనుమతిస్తుండంగా మరికొన్ని మాత్రం పరీక్షా కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈ విధానం అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో అమలుచేస్తున్నారు.

*తాజాగా ‘కర్ణాటక ఓపెన్‌ యూనివర్సిటీ’ ఓపెన్‌ బుక్‌ విధానంలో పరీక్షలను నిర్వహించింది. 2019-20 విద్యాసంవత్సరంలో దాదాపు 12వేల మంది విద్యార్థులు ఈ విధానంలో పరీక్షలకు హాజరైనట్లు యూనివర్సిటీ తెలిపింది.

*ఈమధ్యే దిల్లీ యూనివర్సిటీ ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానాన్ని అమలుచేసింది. తాజాగా రెండో ఫేజ్‌ పరీక్షలను కూడా పూర్తిచేసింది. జవాబు పత్రాలను వీలైనంత తొందరగా మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

*మధ్యప్రదేశ్‌లోనూ డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు ఈ విధానంలోనే పరీక్షలను నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థులు ఇంటివద్ద నుంచే పరీక్షలు రాసే అవకాశం ఉంది. పరీక్షలు రాసిన అనంతరం జవాబు పత్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుంది.

*పాండిచ్చేరి యూనివర్సిటీ కూడా తమ చివరి సంవత్సరం పరీక్షలను ఓపెన్‌ బుక్‌ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షరాసే సమయంలో విద్యార్థులు పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ చూసుకోవచ్చని తెలిపింది.

*కోల్‌కతా యూనివర్సిటీ కూడా ఓపెన్‌ బుక్‌ పరీక్షలకు సిద్ధం అయ్యింది. అయితే, పరీక్ష గడువుపై యూజీసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

*నాగ్‌పూర్‌లోని కవికులగురు కాలీదాస్‌ సంస్కృత యూనివర్సిటీ కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో జరపాలని నిర్ణయించింది. ముఖ్యంగా చివరి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఓపెన్‌ బుక్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌లో సాధ్యంకాని విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ ద్వారా రాయొచ్చని తెలిపింది. వాటి జవాబు పత్రాలను నిర్ణీత గడువులోగా యూనివర్సిటీకి పంపిచాలని విద్యార్థులకు సూచించింది.

ఇదిలాఉంటే, ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానంపై భిన్న వాదనలు ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని