Allahabad Court: విద్యార్థినిని ఆదుకున్న న్యాయస్థానం.. అడ్మిషన్‌ ఫీజు కట్టిన అలహాబాద్‌ హైకోర్టు!

మంచి ర్యాంక్‌ సాధించి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించినా.. అడ్మిషన్‌ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి అలహాబాద్‌ హైకోర్టు అండగా నిలిచింది. ఆమెను యూనివర్సిటీలో చేర్పించడం కోసం స్వయంగా అడ్మిషన్‌ ఫీజు రూ. 15వేలు చెల్లించింది.. మూడు రోజుల్లో

Updated : 01 Dec 2021 04:27 IST

అలహాబాద్‌: మంచి ర్యాంక్‌ సాధించి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించినా.. అడ్మిషన్‌ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి అలహాబాద్‌ హైకోర్టు అండగా నిలిచింది. ఆమెను యూనివర్సిటీలో చేర్పించడం కోసం స్వయంగా అడ్మిషన్‌ ఫీజు రూ. 15వేలు చెల్లించి.. మూడు రోజుల్లో యూనివర్సిటీలో చేరమని విద్యార్థినికి సూచించింది. 

యూపీకి చెందిన విద్యార్థిని సంస్కృతి రంజన్‌ ఇటీవల జేఈఈ పరీక్షలో 92.77 పర్సంటైల్‌తో ఉత్తీర్ణత పొంది 2,062వ ర్యాంకు సాధించింది. ఎస్సీ కోటాలో మంచి ర్యాంకు పొందిన ఆమె బీహెచ్‌యూలో ఐదేళ్ల మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ కోర్సులో చేరాలని భావించింది. కానీ.. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పేదరికం.. పైగా ఆమె తండ్రి కిడ్నీ సమస్యతో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. దీంతో అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలని జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది.

యూనివర్సిటీలో అడ్మిషన్‌ ఫీజు చెల్లించలేక తీవ్ర నిరాశకు గురైన సంస్కృతి.. ఇద్దరు న్యాయవాదుల సాయంతో అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. తనకు ఎలాగైనా యూనివర్సిటీలో అడ్మిషన్‌ ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యాన్ని, కేంద్ర విద్యాశాఖకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌కుమార్‌ సింగ్‌ ఆ అడ్మిషన్‌ ఫీజు రూ.15వేలు తామే చెల్లిస్తామని వెల్లడించారు. ‘ఎంతో బాగా చదువుకుంటున్న విద్యార్థిని ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఆమె తండ్రి అనారోగ్యంపాలవడంతో ఫీజు చెల్లించే స్థోమత వారికి లేకుండాపోయింది. విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితి పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ అడ్మిషన్‌ ఫీజును కోర్టే చెల్లిస్తుంది’అని జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని