Anand Mahindra: పద్మభూషణ్‌కు నేను అనర్హుడినేమో: ఆనంద్‌ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా 2020 సంవత్సరానికి గానూ పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన చేసిన సేవలను

Updated : 10 Nov 2021 05:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా 2020 సంవత్సరానికి గానూ పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. అయితే ఈ అవార్డుకు తాను అనర్హుడినని అనిపిస్తోందని మహీంద్రా అంటున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

‘‘ఈ ప్రభుత్వం.. పద్మ పురస్కారాల గ్రహీతల ఎంపికలో పరివర్తనమైన మార్పులు చేసింది. ఇప్పుడు అట్టడుగు స్థాయిలలో సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తులపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇలాంటి గొప్ప వారి పక్కన ఈ పురస్కారం తీసుకునేందుకు నేను నిజంగా అనర్హుడిగా భావిస్తున్నా’’ అని ఆనంద్‌ మహీంద్రా రాసుకొచ్చారు. వేల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న కర్ణాటకకు చెందిన తులసి గౌడను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే. ఆమె అవార్డు తీసుకుంటున్న ఫొటోను షేర్‌ చేస్తూ ఆనంద్‌ మహీంద్రా ఇలా వ్యాఖ్యానించారు. తులసి గౌడతో పాటు.. పండ్లు అమ్ముకుంటూ పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించిన హరేకల హజబ్బాకు కూడా నిన్న పద్మశ్రీ అవార్డును అందించారు.

కాగా.. మహీంద్రా ట్వీట్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘మీ నిజాయతీ చాలా గొప్పది సర్‌. కానీ మీరు కూడా ఈ సమాజం కోసం ఎంతగానో సేవ చేస్తున్నారు. ఓ గొప్ప పారిశ్రామికవేత్తగా ఎప్పటికీ గుర్తుండిపోతారు’’ అంటూ నెటిజన్లు కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని