PV Sindhu: సింధుకు థార్‌ వాహనం ఇవ్వండి.. ఆనంద్‌ మహింద్రా అదిరిపోయే రిప్లై

వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది వీపీ సింధు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఈ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి.. తాజా టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యంతో మెరిసింది....

Updated : 02 Aug 2021 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఈ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి.. తాజా టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యంతో మెరిసింది. ఈ విజయంతో కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ట్విటర్‌ యూజర్‌ ఆసక్తికరంగా స్పందించాడు. సింధు గెలుపునకు బహుమానంగా.. మహింద్రా కంపెనీ రూపొందించిన థార్‌ వాహనాన్ని ఆమెకు బహుమానంగా ఇవ్వాలని కోరాడు. తన కోరికను తెలియజేస్తూ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్రాను తన పోస్టుకు ట్యాగ్‌ చేశాడు.

ఆ పోస్టుపై ఆనంద్‌ మ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇప్పటికే సింధు గ్యారేజ్‌లో ఓ థార్‌ వాహనం పార్క్‌ చేసి ఉంది’ అని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌ 2016లో పతకాలు సాధించిన పీవీ సింధు, రెజ్లర్‌ సాక్షి మలిక్‌కు అప్పుడే మహింద్రా కంపెనీ థార్‌ వాహనాలను బహుమతిగా అందించింది. ఆ విషయాన్ని ఆనంద్‌ మహింద్రా చెప్పకనే చెప్పారు. బహుమతిగా ఇచ్చిన థార్‌ వాహనంలో సింధు, సాక్షి మలిక్‌ ప్రయాణిస్తున్న ఓ ఫొటోను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

పీవీ సింధు విజయం పట్ల ఆనంద్‌ మరో ట్వీట్‌లో ప్రశంసలు కురిపించారు. సింధు ఫొటోను పంచుకుంటూ ఆమె ప్రదర్శన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ‘మానసిక బలానికి కూడా ఒలింపిక్స్‌ ఉంటే ఆమె అందరికంటే టాప్‌లో ఉంటుంది. నిరుత్సాహపరిచిన ఓటమిని అధిగమించేందుకు ఎంతటి శక్తిసామర్థ్యాలు, నిబద్ధత అవసరమో ఆలోచించండి. నువ్వెప్పుడూ మా బంగారు అమ్మాయివే సింధూ..’ అంటూ ట్వీట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని