
Anand Mahindra: ఆయనో సూపర్ హీరో.. ‘మట్కామ్యాన్’పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా.. వినోదాత్మక, ఆలోచింపజేపే, వినూత్న ఫొటోలు, వీడియోలను ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ప్రతిభగల వారిని ప్రోత్సహిస్తూ, ఇతరులకు సాయపడేవారిని అభినందిస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి దిల్లీలో అనేకమంది దాహార్తి, ఆకలి తీరుస్తున్న ఓ వృద్ధుడిని తాజాగా ఆయన ప్రశంసించారు.
దిల్లీలోని పంచ్శీల్ ప్రాంతానికి చెందిన అలగ్ నటరాజన్ అనే వృద్ధుడు దక్షిణ దిల్లీలోని పలు ప్రాంతాలకు ఏళ్లుగా మంచినీటిని అందిస్తున్నారు. కుండలను ఏర్పాటు చేసి ప్రతిరోజు వాటిల్లో మంచినీరు నింపుతున్నారు. ఇందుకోసం ఆయన రెండు మహీంద్రా బొలెరో వాహనాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఒక్కో వాహనంలో రెండేసి ట్యాంకర్లను (ఒక్కోటి వేయి లీటర్లు) అమర్చారు. నటరాజన్ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఆ రెండు వాహనాలను తీసుకువెళ్లి అమర్చిఉన్న కుండల్లో నీటిని నింపుతారు. ఈ కార్యక్రమం అనంతరం స్వయంగా భోజనం తయారుచేసి పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. నిర్మాణరంగంలో పనిచేస్తున్నవారికి, కూలీలకు ఈ ఆహారాన్ని పంచిపెడుతున్నారు. నటరాజన్ సేవలకు గాను స్థానికులు ఆయనను ‘మట్కామ్యాన్’ అని పిలుస్తారు.
నటరాజన్ చేస్తున్న ఈసేవలను తాజాగా ఆనంద్ మహీంద్రా అభినందించారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘మార్వెల్ హీరోలకన్నా ఎక్కువ శక్తులున్న సూపర్ హీరో మట్కామ్యాన్. ఇంగ్లాండ్లో వ్యాపారవేత్త అయిన ఆయన.. స్వదేశంలోని పేదలకు సేవ చేసేందుకు తిరిగి వచ్చిన క్యాన్సర్ విజేత. మీరు చేపట్టిన గొప్ప పనిలో బొలెరోను భాగం చేసినందుకు ధన్యవాదాలు సర్’ అంటూ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
Advertisement