ఆటోపై ఇల్లు..అభినందించిన ఆనంద్‌ మహీంద్ర

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ఓ ఆర్కిటెక్ట్‌  ఆటో రిక్షాపై చిన్నపాటి ఇల్లును నిర్మించడం ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

Published : 01 Mar 2021 14:54 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ఓ ఆర్కిటెక్ట్‌  ఆటో రిక్షాపై చిన్నపాటి ఇల్లును నిర్మించడం ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సదరు వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. వివరాల ప్రకారం చెన్నైకి చెందిన అరుణ్‌ ప్రభు అనే ఆర్కిటెక్ట్‌ సుమారు లక్ష రూపాయల ఖర్చుతో ఓ రవాణా ఆటో రిక్షాపై ‘సోలో 1’ అనే పేరుతో చిన్న ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఫొటోలను ఓ ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేయడంతో ఆనంద్‌ మహీంద్ర దాన్ని చూసి మెచ్చుకున్నారు.

‘‘ చిన్న చిన్న ప్రాంతాల్లో అద్భుతాను సృష్టించొచ్చు అని అరుణ్‌ నిరూపించాడు. కానీ ఆయన ఆలోచన మాత్రం చాలా పెద్దది. కరోనా సంక్షోభం తర్వాత ఎప్పుడూ ఏదోక చోటుకు వెళ్లాలనుకొనే వారి కోరిక తీరే మార్గం ఇదే.’’ అని ఆనంద్‌ మహీంద్ర ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘బొలెరో పికప్‌పై ఈ విధంగా అతడు రూపొందిస్తాడా అని నేను అడగాలనుకుంటున్నాను. మమ్మల్ని ఎవరైనా కనెక్ట్‌ చేయగలరా?’’ అని ఆనంద్ మహీంద్ర అడిగారు. దీంతో పలువురు నెటిజన్లు అరుణ్‌ప్రభు వివరాలను ఆనంద్‌ మహీంద్రాకు తెలుపుతున్నారు.

గతంలో అరుణ్‌ ప్రభు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మురికివాడల్లో తక్కువ స్థలంలో (6×6) మంచి గృహాలు ఏర్పాటు చేయొచ్చు అని తెలిపారు. ‘‘ సాధారణంగా మేము పెద్ద పెద్ద స్థలాల్లో వినూత్న నిర్మాణాలు ఏర్పాటు చేసేందుకే ప్రయత్నిస్తాం. కానీ చిన్న స్థలాల్లో నిర్మాణాలకు ప్రాముఖ్యత ఇవ్వం. నేను అభివృద్ధి చేస్తున్న సోలో 1 అనే నమూనా ద్వారా భారత్‌లో తాత్కాలిక, పోర్టబుల్‌ ఇళ్లను నిర్మించడమే నా లక్ష్యం.’’ అని అరుణ్‌ గతంలో వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని