కరోనా టీకా తీసుకుంటున్నారా? 

ఎన్నో పరిశోధనలు. ఎన్నో ప్రయోగాలు. ఎన్నో సవరణలు. ఎన్నో పరీక్షలు. ఇంత కష్టపడి రూపొందించినా టీకాలు పూర్తి రక్షణ కల్పించలేవు. కొందరిలో

Updated : 16 Feb 2021 14:18 IST

ఎన్నో పరిశోధనలు. ఎన్నో ప్రయోగాలు. ఎన్నో సవరణలు. ఎన్నో పరీక్షలు. ఇంత కష్టపడి రూపొందించినా టీకాలు పూర్తి రక్షణ కల్పించలేవు. కొందరిలో సమర్థంగా పనిచేస్తే.. మరికొందరిలో అంత ప్రభావం చూపలేవు. ఎందుకు? మన శరీర స్వభావం మాట అటుంచితే ఇతరత్రా అంశాలేవైనా ఇందుకు దోహదం చేస్తాయా? పరిశోధనలు ఇదే చెబుతున్నాయి. కుంగుబాటు (డిప్రెషన్‌), మానసిక ఒత్తిడి (స్ట్రెస్‌), దురలవాట్ల వంటివి మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంలో, ఆయా టీకాల సామర్థ్యం తగ్గటంలో పాలు పంచుకుంటున్నాయని వివరిస్తున్నాయి. తాజా కొవిడ్‌-19 టీకాలకూ ఇదే వర్తిస్తుంది. మన అలవాట్లు, ప్రవర్తన మార్పులతో టీకాలకు శరీరం మరింత మెరుగ్గా స్పందించేలా చూసుకోవచ్చు. టీకా వేగంగా, సమర్థంగా పనిచేసేలా చూసుకోవచ్చు. ఇవేమీ కష్టమైన పనులు కావు. చాలా తేలికైనవే.

ఒత్తిడికి దూరం: ఒత్తిడితో బాధపడేవారిలో టీకాలకు యాంటీబాడీల ప్రతిస్పందన బలహీనపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అదే టీకా తీసుకునే రోజున మానసికంగా ఉత్సాహంగా ఉన్నవారిలో యాంటీబాడీల ప్రతిస్పందన బలంగా ఉంటోందని వివరిస్తున్నాయి. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండటం, టీకా తీసుకునే సమయంలో ప్రశాంతంగా ఉండటం మంచిది. రోజూ ధ్యానం, ప్రాణాయామం వంటివి చేస్తుంటే ఒత్తిడి బారినపడకుండా కాపాడుకోవచ్చు.

కంటి నిండా నిద్ర: టీకా తీసుకోవటానికి ముందు రోజు నిద్ర సరిగా పట్టనివారితో పోలిస్తే కంటి నిండా నిద్రపోయినవారిలో రోగనిరోధక వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇది యాంటీబాడీల ప్రతిస్పందన బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. కాబట్టి నిద్ర బాగా పట్టేలా చూసుకోవటం అన్ని విధాలా మంచిది. ఇది టీకా తీసుకునే సమయంలో భయం, ఆందోళన తగ్గటానికీ ఉపయోగపడుతుంది.

నలుగురితో కలివిడిగా: ఒంటరితనంతో విచారం, దిగులు ఆవహిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించేలా చేస్తాయి. టీకాకు యాంటీబాడీల ప్రతిస్పందన కూడా తగ్గుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం ఎవరికైనా మంచిదే. నలుగురితో కలివిడిగా ఉండటం వల్ల మానసిక బలం ఇనుమడిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేయటానికి తోడ్పడుతుంది.

మద్యం జోలికి వెళ్లొద్దు: టీకా తీసుకోవటానికి ముందు రోజు, టీకా తీసుకున్న తర్వాత మద్యం జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అతిగా మద్యం తాగితే రోగనిరోధక కణాల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. ఇది శరీరం వైరస్‌ను ఎదుర్కోవటానికి అవసరమైన శక్తిని తగ్గిస్తుంది. మద్యం జోలికి వెళ్లకపోవటం, ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవటం ఎంతైనా అవసరం.

వ్యాయామం మేలు: బద్ధకంగా కూర్చొనేవారితో పోలిస్తే తగినంత శారీరక శ్రమ చేసేవారిలో రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. టీకా తీసుకోవటానికి 15 నిమిషాల ముందు నడవటం వంటి వ్యాయామాలు చేసినవారిలో టీకాలకు యాంటీబాడీల ప్రతిస్పందన మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క టీకా కోసమే కాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేసేదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు