Published : 22/03/2021 01:53 IST

పిచ్చుకల పాలిట దైవం ఈ గణేశన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగరీకరణ జరుగుతున్న కొద్దీ.. ఒక మార్పును గమనించారా? నిత్యం ఇంటి వద్ద కిచకిచ అని శబ్దాలు చేస్తూ ఆకట్టుకునే పిచ్చుకలు రాను రాను కనుమరుగవుతున్నాయి. అభివృద్ధి పేరుతో పట్టణాల్లో చెట్లను నరికేస్తుండటంతో వాటికి ఉండటానికి చోటు లేక నగరాల్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. కొన్ని నగరాల్లో తిరుగుతున్నా.. ఎండకు, వానకు తలదాచుకునే చోటు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ఈ కాలం పిల్లలకు పిచ్చుకలు పుస్తకాల్లో.. టీవీల్లో కనిపించడమే తప్ప.. నిజంగా కనిపించడం గగనమైపోయింది. అందుకే, వలస వెళ్లిపోకుండా పిచ్చుకలు నగరాల్లో ఉండిపోయేలా వాటికంటూ ఒక గూడు ఏర్పాటు చేస్తున్నాడు చెన్నైకి చెందిన గణేశన్‌. ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. మరోవైపు పిచ్చుకల కోసం స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నాడు.

చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న గణేశన్‌.. ఉండటానికి నీడలేక పిచ్చుకలు నగరాన్ని వదిలి వెళ్తుండటాన్ని గమనించాడు. ఎలాగైనా వాటిని నగరంలో ఉండేలా చేయాలనుకున్నాడు. పిచ్చుకలకు గూళ్లు ఏర్పాటు చేస్తే.. వలసవెళ్లడం ఆపేస్తాయని భావించాడు. దీంతో 2017లో పిచ్చుకలకు గూడు ఏర్పాటు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇళ్లలో పక్షుల కోసం గూడు, ఆహారం ఏర్పాటు చేయాలని కోరాడు. అప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న పక్షుల గూడును కొనుగోలు చేసి ఇంటి పెరట్లో.. లేదా ఇంటిపైన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. తాను కూడా వందల సంఖ్యలో గూళ్లు కొనుగోలు చేసి తనుండే రాయపురం ప్రాంతంలో స్థానికులకు పంపిణీ చేశాడు. 

సొంతగా గూళ్లు తయారు చేస్తూ..

గూళ్లను కొని పంపిణీ చేసినా.. గణేశన్‌కు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో తనే ముడి సరుకులు కొనుగోలు చేసి.. స్వయంగా గూళ్లు నిర్మించాలని నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో కూడుగల్‌ నెక్ట్స్‌ ట్రస్ట్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాడు. కూడుగల్‌ అంటే గూళ్లు అని అర్థం. తొలి నెలలోనే 500 గూళ్లు నిర్మించాడు. అలాగే, తన విద్యార్థులతో కలిసి గూడు ఎలా తయారు చేయాలో వర్క్‌షాపులు నిర్వహించడం ప్రారంభించాడు. దీంతో ప్రతి ఒక్కరు పిచ్చుకలకు ఎదురవుతోన్న కష్టాలేంటో తెలుసుకోగలుతున్నారు. వాటికి రక్షణ కల్పించేలా గూడు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనపబరుస్తున్నారు. నగరంలో ఉన్న పిచ్చుకలకు నీడ కల్పించడంతోపాటు వలస వెళ్లిపోయిన పిచ్చుకలను తిరిగి నగరంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని గణేశన్‌ వెల్లడించాడు. ఇప్పటి వరకు అతడు 1,200పైగా గూళ్లను చెన్నై వ్యాప్తంగా ఏర్పాటు చేయగా.. 950 గూళ్లలో పిచ్చుకలు నివాసం ఉంటున్నాయట. రానున్న రోజుల్లో మరిన్ని గూళ్లు తయారు చేసి.. చెన్నై నగరమంతా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు  చెప్పాడు. పక్కనుండే మనిషి కష్టాన్ని గుర్తించలేకపోతున్న ఈ సమాజంలో పిచ్చుకుల ఉనికి కోసం గణేశ్‌ చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం!

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని