
Tamilnadu: పేడతో కొట్టుకుంటేనే వాళ్లకు దీపావళి!
చెన్నై: దీపావళి పర్వదినాన్ని సాధారణంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుతూ.. ఆనందంగా జరుపుకొంటారు. కానీ, తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని వినూత్నంగా చేసుకున్నారు. ఆవు పేడతో కొట్టుకుంటూ పండగ జరుపుకొన్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గుమటపురం గ్రామానికి చెందిన ప్రజలు పండుగ రోజు ఒకే చోట చేరి గోరాయ్ హబ్బా అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆవుపేడను ఒకరిపై ఒకరు విసురుకుంటూ సందడిగా గడిపారు. ఈ పండుగలో గ్రామస్థులు శరీరభాగాలకు పేడను పూసుకుంటూ వేడుక చేసుకుంటారు. పేడను విసురుకునేటప్పుడు కోపాన్ని దరి చేరనీయకుండా ఇతరుల పట్ల స్నేహభావాన్నే కలిగి ఉంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని గుమటపురం గ్రామప్రజలు కొనసాగిస్తున్నారు. 100 ఏళ్ల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
ఆవుపేడను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించి గ్రామంలోని ధీరేశ్వర దేవాలయం వద్ద పోగుచేస్తారు. ఆ ప్రదేశాన్ని రంగు రంగుల కాగితాలతో అలంకరిస్తారు. పండుగ రోజు అక్కడికి గుంపుగా వెళ్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. సంప్రదాయంగా ప్రతి ఏడాదీ ఈ పండగను జరుపుకొంటామని, కుల వివక్షకు తావులేకుండా అందరం కలిసి ఒక చోట ఈ వేడుకను నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు. కలిసి మెలిసి జీవించాలనే సందేశాన్ని ‘గోరాయ్ హబ్బా’ కార్యక్రమం ఇస్తుందని అన్నారు.