మృతులకు వివాహం.. కేరళలో వింత ఆచారం..!!

కేరళలోని ఓ తెగ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లికాకుండా చనిపోయిన తమవారికి వివాహం జరుపుతున్నారు......

Published : 30 Oct 2021 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళలోని ఓ తెగ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లికాకుండా చనిపోయిన తమ వారికి వివాహం జరుపుతున్నారు. పెళ్లి చూపులు మొదలుకొని ఆహ్వాన పత్రికలు పంచడం వరకు సాధారణ పెళ్లి వేడుకకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఘనంగా వివాహం జరిపిస్తున్నారు. అసలు చనిపోయిన వారికి ఎలా పెళ్లి జరిపిస్తారు? ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకుందాం..

కేరళ కాసర్‌గడ్‌ జిల్లా మారుమూల ప్రాంతమైన బడియడుక్కా గ్రామానికి చెందిన మగోర్‌ తెగ ప్రజలు చాలా కాలంగా చనిపోయివారికి వివాహాలు జరిపిస్తున్నారు. పెళ్లి కాకముందే మృతిచెందిన తమవారికి బొమ్మల రూపంలో ఈ వివాహం జరిపిస్తారు. తద్వారా మృతిచెందినవారి ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటాయన్నది వారి నమ్మకం. అయితే మృతిచెందినవారికి వివాహం అంటే ఏదో సాదాసీదాగా బొమ్మలకు పెళ్లి చేసి ఊరుకుంటారని భావిస్తే పొరపాటే. సాధారణంగా ఇద్దరు వ్యక్తుల పెళ్లికి ఏమేం చేస్తారో అన్నింటినీ ఈ పెళ్లిలో ఆ తెగ ప్రజలు పాటిస్తారు.

ముందుగా పెళ్లి కాకుండా చనిపోయిన తమ యువకుడి పెళ్లి కోసం వారి బంధువులు.. పెళ్లి కాకుండా మరణించిన యువతి ఇంటికి పెళ్లిచూపులకు వెళతారు. అక్కడ అన్నీ మాట్లాడుకొని వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఆహ్వాన పత్రికల్ని ముద్రించి బంధువులకు అందజేస్తారు. పెళ్లి రోజునాడు మండపాన్ని అందంగా ముస్తాబుచేస్తారు. బొమ్మల రూపంలో ఆ యువ జంటను తయారుచేసి.. వారికి పెళ్లి చేసి ఒక్కటి చేస్తారు. అయితే సాధారణంగా ఈ కార్యక్రమాన్ని రాత్రిపూట మాత్రమే నిర్వహిస్తారు. వివాహానికి వచ్చిన అతిథుల కోసం మంచి విందు ఏర్పాటుచేసి పెళ్లి జంటను దీవించండి అంటూ కోరతారు.

వివాహం తర్వాత వధూవరుల కుటుంబాలు ఎవరిదారి వారు చూసుకోకుండా ఇకపై కూడా వారు బంధువులుగానే కొనసాగుతారు. తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళుతూ తమ బంధుత్వాన్ని కొనసాగిస్తారు. వివాహం కాకుండా చనిపోయిన వారికి పెళ్లి చేయకుండా ఉంటే చెడు జరుగుతుందని మగోర్‌ తెగ ప్రజలు చెబుతున్నారు. అందుకే ఒకవేళ ఎవరైనా చిన్న వయసులోనే మృతిచెందితే వారి పెళ్లి వయసు వచ్చేవరకు ఆగి ఇలా చేస్తామని పేర్కొంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు