Ayodhya Ram temple: అయోధ్య రామమందిరానికి.. 115 దేశాల జలం 

అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి ఏడు ఖండాల్లోని 115 దేశాల నుంచి జలం భారత్‌కు చేరింది. ఈ జలాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వీకరించారు.   

Updated : 19 Sep 2021 04:39 IST

దిల్లీ: అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి ఏడు ఖండాల్లోని 115 దేశాల నుంచి పవిత్ర జలాలు భారత్‌కు చేరాయి. విదేశాల నుంచి వచ్చిన ఈ జలాన్ని రామజన్మభూమి ట్రస్ట్‌ జనరల్‌ సెక్రెటరీ చంపత్‌ రాయ్‌ ఆధ్వర్యంలో.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిల్లీలోని తన నివాసంలో స్వీకరించారు. వారి వెంట డెన్మార్క్, ఫిజీ, నైజీరియా సహా పలు దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఉన్నారు. భాజపా నేత, దిల్లీ మాజీ ఎమ్మెల్యే విజయ్ జాలీ నేతృత్వంలోని ఎన్‌జీఓ సంస్థ ద్వారా ఈ నీటిని సేకరించారు. ఈ జలాన్ని రామమందిరం నిర్మాణంతోపాటు రాముని అభిషేకానికి వినియోగించనున్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. 115 దేశాల్లోని హిందువులు, ముస్లింలు, బుద్ధులు, సిక్కులు, యూదుల అక్కడి పవిత్ర నదులతోపాటు సముద్ర జలాన్ని పంపించినట్లు తెలిపారు. మరో 77 దేశాలనుంచి జలం రావాల్సి ఉందని పేర్కొన్నారు. ‘ఏడు ఖండాల్లోని 192 దేశాల్లో గల పవిత్ర జలాన్ని సేకరిస్తున్నాం. 115 దేశాల నుంచి నీటిని సేకరించాం. రామమందిర నిర్మాణం పూర్తయ్యేలోపు మిగితా 77 దేశాల్లోని జలం కూడా రానుంది’ అని తెలిపారు. ఇలా అన్ని దేశాల నుంచి జల సేకరణ వినూత్న ఆలోచన అని, ఇది వసుధైవ కుటుంబాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, దేశంలో కులాలు, మతాలు ఆధారంగా ఎలాంటి వివక్షత లేదని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని