ముందస్తు ఓటింగ్‌: ఎందుకు.. ఎక్కడ.. ఎలా?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నిర్దేశించిన నవంబర్‌ 3న ఎన్నికలు జరిగాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పోలింగ్‌ తేదీ కంటే ముందే కొన్ని కోట్ల మంది అమెరికన్లు ముందస్తు ఓటు వేసేశారు. ఇలా ముందస్తుగా ఓటు

Updated : 04 Nov 2020 20:20 IST

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నిర్దేశించిన నవంబర్‌ 3న ఎన్నికలు జరిగాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పోలింగ్‌ తేదీ కంటే ముందే కొన్ని కోట్ల మంది అమెరికన్లు ముందస్తు ఓటు వేసేశారు. ఇలా ముందస్తుగా ఓటు వేసే సౌలభ్యాన్ని అమెరికానే కాదు.. మరికొన్ని దేశాలు కూడా కల్పిస్తున్నాయి. మరి ఆ దేశాలేవీ? ఎందుకు ముందస్తు ఓటు వేస్తారు? ఎవరు వేయొచ్చు? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి..

ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో పది కోట్ల మంది అమెరికా పౌరులు ముందస్తు ఓట్లు వేసినట్లు అధికారుల అంచనా. ఇలా ముందస్తు ఓటు వేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోలింగ్‌ తేదీన అందుబాటులో ఉండలేమని భావించేవాళ్లు, పోలింగ్‌ కోసం పనిచేసే సిబ్బంది, పార్టీల ప్రచారానికి పనిచేసిన వాళ్లు, వైద్య అవసరాలు ఉన్నవాళ్లు నిర్దేశించిన పోలింగ్‌ తేదీ కంటే ముందే ఓటు వేయొచ్చు. ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ముందస్తు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి గానీ, మెయిల్‌ ద్వారా గానీ ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ అవకాశం సాధారణంగా పోలింగ్‌ తేదీకి ముందు నాలుగు రోజుల నుంచి 45 రోజుల వరకు ఉంటుంది. ఈ మధ్య ముందస్తు ఓటింగ్‌ విపరీతంగా పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఇటీవల జరిగిన న్యూజిలాండ్‌ ఎన్నికల్లో, తాజాగా అమెరికా ఎన్నికల్లో వీటి సంఖ్యభారీగా పెరిగింది. అయితే పలువురు సామాజిక నిపుణులు మాత్రం ఈ ముందస్తు ఓటింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియకు ఇది విఘాతం కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు. అయినా ఈ ముందస్తు పోలింగ్‌కు ఆదరణ పెరగడం గమనార్హం.

థాయ్‌లాండ్‌

థాయ్‌లాండ్‌లో ముందస్తు ఓటింగ్‌ 1997 నుంచి అమలులో ఉంది. పౌరులు ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గంలో లేకపోతే.. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయొచ్చు. వలసకార్మికులు, విద్యార్థుల కోసం ఈ వెసులుబాటు కల్పించారు. అయితే, ముందస్తు ఓటు వేయాలంటే పోలింగ్‌ తేదీకి 30 రోజుల ముందుగా జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో పౌరులు తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌ తేదీనాడు వీలు కుదిరి అదే రోజు ఓటు వేయాలని భావిస్తే.. ఈ ముందస్తు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవాలి. విదేశాల్లో ఉండేవాళ్లు ఆయా దేశాల్లో ఉన్న థాయ్‌ రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకొని మెయిల్‌ ద్వారా కానీ, లేదా అక్కడే ఉన్న పోలింగ్‌ కేంద్రంలోగానీ ఓటు వేయొచ్చు.

స్విట్జర్లాండ్‌

స్విట్జర్లాండ్‌లో ఎలాంటి ఎన్నికలు జరిగినా.. ఓటర్లకు కొన్ని వారాల ముందు బ్యాలెట్‌ పేపర్లను మెయిల్‌ ద్వారా పంపిస్తారు. పోలింగ్‌ తేదీన ఆ బ్యాలెట్‌తోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ముందస్తుగా వేయాలి అనుకుంటే మెయిల్‌ ద్వారా స్థానిక పోలింగ్‌ కేంద్రానికి పంపొచ్చు.

స్వీడన్‌

ఇక్కడి ప్రజలు ఓటు హక్కును కచ్చితంగా ఉపయోగించుకుంటారు. ప్రభుత్వం కూడా ఓటు వేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇక్కడ ఓటర్లకు ప్రత్యేకించి రిజిస్ట్రేషన్లు, ఓటర్‌ ఐడీలు అక్కర్లేదు. ప్రతి ఒక్కరి పేరు ప్రభుత్వం రూపొందించిన ఇంటి చిరునామాల జాబితాల్లో రిజిస్టర్‌ అయి ఉంటుంది. పోలింగ్‌ తేదీన ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు వారం ముందు నుంచే ముందస్తు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయొచ్చు. పోలింగ్‌ తేదీన ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల్లో కూడా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే ముందస్తు ఓటింగ్‌ వేస్తే ఆ ఓటును ఎన్వలప్స్‌లో పోలింగ్‌ కేంద్రాలకు పంపాలి. పోలింగ్‌ తేదీన ఓటు వేయాలనుకుంటే.. ముందస్తు ఓటు లెక్కించడానికి ముందే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎవరైనా రెండు ఓట్లు వేస్తే.. పరిశీలించి ముందస్తు ఓటును తొలగిస్తారు.  

న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌లో ముందస్తు ఓటింగ్‌కి ప్రత్యేక కారణాలు ఏవీ అక్కర్లేదు. పోలింగ్‌ తేదీకి 12 రోజుల ముందు నుంచి ముందస్తు పోలింగ్‌ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 500కుపైగా ముందస్తు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పౌరులు ఎవరైనా, ఎప్పుడైనా ఈ పోలింగ్‌లో పాల్గొనవచ్చు. ఓటర్లు పోలింగ్‌ సమయానికి వేరే ప్రాంతాల్లో ఉండి ఓటు వేయలేకపోతే వారికి ప్రత్యేకంగా ఓటు వేసే అవకాశం ఇస్తారు. 

ఐర్లాండ్‌

రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌లోని కొన్ని దీవుల్లో అధికారికంగా ప్రకటించిన పోలింగ్‌ తేదీకంటే ఒక రోజు ముందుగానే ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఐలాండ్స్‌లో వేసిన ఓట్ల బ్యాలెట్‌ బాక్స్‌లను సమయానికి ఓట్ల లెక్కింపు కార్యాలయానికి చేర్చడం కోసమే ఇలా ముందురోజు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఐలాండ్స్‌లో కొన్నిసార్లు బ్యాలెట్‌ బాక్సులను తరలించే సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారుతుంటుంది.

జర్మనీ 

ఈ దేశంలో అర్హులైన పౌరులందరికీ పోలింగ్‌ తేదీకి మూడు వారాల ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్‌తోపాటు ఓటు అప్లికేషన్‌ ఫారాన్ని అధికారులు పంపిస్తారు. ఓటు వేయాలనుకునే వారు స్థానిక మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి ఓటు వేయొచ్చు. విదేశాల్లో ఉండేవాళ్లు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోని మెయిల్‌ ద్వారా ఓటు వేయాలి. అయితే స్థానిక ఎన్నికల్లో ఓటు వేయలేరు. 2008 వరకు ముందస్తు ఓటింగ్‌కు కొన్ని నిబంధనలు ఉండేవి. ఆ తర్వాత ఎవరైనా ముందస్తు ఓటింగ్‌ వేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. 

ఫిన్‌లాండ్‌

ఫిన్‌లాండ్‌లో ముందస్తు ఓటింగ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తారు. పోలింగ్‌ తేదీకన్నా ముందే మున్సిపల్‌ కార్యాలయాలు, గ్రంథాలయాలు, పోస్ట్‌ ఆఫీసులు, ఆస్పత్రులు, జైళ్లు, విదేశాల్లోని ఫిన్‌లాండ్‌ రాయబార కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఇంటి నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉంటే ఓటరు విజ్ఞప్తి మేరకు ముందస్తుగా లేదా పోలింగ్‌ తేదీన ఎన్నికల సిబ్బందే ఇంటికొచ్చి మరీ ఓటు వేయిస్తారు. అలాగే మెయిల్‌ ఓటింగ్‌ను కూడా స్వీకరిస్తారు. గతేడాది నుంచి పోస్టల్‌ ఓట్లను ఫిన్‌లాండ్‌ స్వీకరిస్తోంది. విదేశాల్లో ఉండి పోలింగ్‌లో పాల్గొనలేకపోయిన వారు.. పోస్టు ద్వారా తమ ఓటును ఎన్నికల కార్యాలయానికి, లేదా వారి మున్సిపల్‌ కార్యాలయానికి పంపొచ్చు. 

కెనడా

కెనడాలో అన్ని రకాల ఎన్నికల్లో ముందస్తు పోలింగ్‌కు అనుమతిస్తారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటు వేయడం కోసం రిజిస్ట్రేషన్‌ లాంటివేవి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓటరుకి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఓటర్‌ ఐడీ ఉంటే చాలు. అవి లేకపోతే తన గురించి తెలిసిన వ్యక్తిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి తను వారికి తెలుసని ప్రమాణం చేయించాలి.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో ఓటు వేయడం తప్పనిసరి. వేయకపోతే నేరంగా పరిగణిస్తారు. అందుకే అనేక కారణాలతో ఓటు వేయలేని వారి కోసం దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ముందస్తు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గతేడాది అక్కడ జరిగిన ఎన్నికల్లో 40.7శాతం ఓటర్లు ముందస్తు పోలింగ్‌లో పాల్గొనడం గమనార్హం. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు