
chittoor: చిత్తూరు జిల్లాలో వరద బీభత్సం: కొట్టుకుపోయిన నలుగురు మహిళలు
చిత్తూరు: భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా అతాకుతలం అవుతోంది. ఎటుచూసినా వరదలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బలిజపల్లి చెరువు వద్ద కాజ్‌వేపై నలుగురు మహిళలు వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని జయంతి, కస్తూరి, ఉషారాణి, లక్ష్మీదేవిగా గుర్తించారు. వీరు బంగారుపాళ్యం మండలం టేకుమండ వాసులుగా గుర్తించారు. గల్లంతైన వారికోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
50 మంది రోగులు స్విమ్స్‌కు తరలింపు
మరోవైపు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్యసేవలు ఆగిపోయాయి. ఆసుపత్రి విద్యుత్ మీటర్లు వరద నీటిలో మునిగిపోయాయి. 50 మంది రోగులను అధికారులు స్విమ్స్‌కు తరలించారు. విద్యుత్ పునరుద్ధరించే వరకు రోగులు ఆసుపత్రికి రావద్దని సూపరింటెండెంట్ సూచించారు.
భారీ వరదలతో మాల్వాడి గుండం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సప్తగిరుల నుంచి వస్తున్న వరద నీటితో ఈ ప్రవాహం ఉద్ధృతమైంది. ఈ వరద ఉద్ధృతికి కపిలతీర్థం ఆలయంలో రెండు రాతి స్తంభాలు కూలాయి. వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన మండపంలో పైకప్పు, గోడ కూలాయి. మరోవైపు కడప-తిరుపతి జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో జాతీయ రహదారిపై వరద ప్రవాహం పెరిగింది. రహదారిపై కార్లు కూడా మునిగే స్థాయిలో వరద నీర చేరింది. బాలపల్లి, కుక్కలదొడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కడప-తిరుపతి మార్గంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.