గల్వాన్ వీరుల జ్ఞాపకార్థం.. ఆర్మీ సంస్మరణ కార్యక్రమం

గల్వాన్‌లో గతేడాది చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన భారత సైనికుల జ్ఞాపకార్థం లేహ్‌లో సంస్మరణ కార్యక్రమాన్ని సైన్యం నిర్వహించనుంది.

Published : 14 Jun 2021 23:50 IST

దిల్లీ: గల్వాన్‌లో గతేడాది చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన భారత సైనికుల జ్ఞాపకార్థం లేహ్‌లో సంస్మరణ కార్యక్రమాన్ని సైన్యం నిర్వహించనుంది. లేహ్‌లోని ఫైర్‌, ఫ్యూరీ కోర్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్న సీనియర్‌ సైనికాధికారి.. ఈ సందర్భంగా పుష్చగుచ్ఛం సమర్పించి వారికి నివాళులు అర్పిస్తారని సైన్యం తెలిపింది. లద్దాఖ్‌లోని గల్వాన్‌లో గతేడాది జూన్‌ 15 రాత్రి చైనా బలగాల దుందుడుకు చర్యల వల్ల జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసిందే.  గడిచిన 45 ఏళ్లలో వాస్తవాధీన రేఖ వద్ద ఇంత మొత్తంలో భారత సైనికులు అమరులవడం ఇదే ప్రథమం. 

భారత్‌-చైనాల మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నా.. పరిస్థితులు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో పాంగాంగ్‌ సరస్సు వద్ద పరస్పర బలగాల ఉపసంహరణతో ఇరు దేశాల మధ్య కొంత మేర సానుకూల వాతావరణం ఏర్పడింది. కానీ గోగ్రా, దెస్పాంగ్‌ ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో చర్చల దశలో ఉన్న ఒప్పందాలను పూర్తి చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయిలో శాంతిని నెలకొల్పడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బగ్చి గత వారం తెలిపారు. ఈ ఏడాది మార్చిలో దౌత్యపరమైన చర్చలు, ఏప్రిల్‌లో ఇరు దేశాల కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశాలు జరిగాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు