తెలుగు రాష్ట్రాల్లో 11 సార్లు భూ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై భూ భౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ స్పందించారు. రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూ ప్రకంపనలు వచ్చాయని, భూకంప లేఖినిపై తీవ్రత 4.6గా

Updated : 26 Jan 2020 13:21 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై భూ భౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ స్పందించారు. రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూ ప్రకంపనలు వచ్చాయని, భూకంప లేఖినిపై తీవ్రత 4.6గా నమోదైందని తెలిపారు. భూమి కంపించినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావడమే సురక్షితమని, కట్టడాలు పటిష్టంగా ఉన్నాయో లేవో నిర్ధరణ చేసుకోవాలని సూచించారు. 
గత కొన్ని రోజులుగా పులిచింతల ప్రాంతంలో భూమిలో కదలికలు ఏర్పడ్డాయని, మరి కొద్ది రోజుల వరకు భూమిలో ఇలాంటి కదలికలు వస్తాయని వెల్లడించారు. ప్రకంపనలకు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. సూర్యాపేట జిల్లా దొండపాడు, గుంటూరు జిల్లా అచ్చంపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
 

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత  ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాలలో, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో, కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక 2.37 గంటల సమయంలో 3 నుంచి 6 సెకన్ల పాటు భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని స్థానికులు తెలిపారు. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల క్రితం జనవరి 26న కూడా ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడు, నాగులవంచ తదితర గ్రామాలలో భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని