ప్యూన్‌.. టీచర్‌లా మారి!

ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఓ ప్యూన్‌ ఏకంగా ఉపాధ్యాయుడి అవతారమెత్తాడు. తన విధులు నిర్వర్తిస్తూనే పిల్లలకు గణితం బోధిస్తున్నాడు. విద్యార్థులు సైతం అంతే శ్రద్ధగా.....

Published : 29 Feb 2020 00:24 IST

అంబలా (హరియాణా): ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఓ ప్యూన్‌ ఏకంగా ఉపాధ్యాయుడి అవతారమెత్తాడు. తన విధులు నిర్వర్తిస్తూనే పిల్లలకు గణితం బోధిస్తున్నాడు. విద్యార్థులు సైతం అంతే శ్రద్ధగా వింటున్నారు. అధికారులు సైతం అతడి పనిని సమర్థిస్తున్నారు. హరియాణాలోని అంబలా సమీపంలోని మజ్రీ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  మజ్రీ పాఠశాలలో పాఠశాలలో 400 మంది విద్యార్థులు, 19 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ గణితంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) కేవలం ఒకే ఒక్కరు. దీంతో వారానికి ఆయనే 54 తరగతులు (పిరియడ్స్‌) బోధించాల్సి వస్తుంది. అయితే అదే సమయంలో ఆయన ఎన్నికల విధులు కూడా నిర్వర్తించాల్సి రావడంతో ఆ పాఠశాలకు గణితం ఉపాధ్యాయుడు కరవయ్యాడు. దీంతో ఆ పాఠశాల ఓ నిర్ణయానికి వచ్చింది. ప్యూన్‌గా పనిచేసే కమల్‌ సింగ్‌ తొమ్మిదో తరగతి గణితం పాఠాలు చెప్పిస్తోంది. అలా అని అతడు చదువులో తక్కువ అర్హత ఏమీ సాధించలేదు. భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పొందాడు. అతడు బోధించే పాఠాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వింటూ నేర్చకుంటున్నారు. 

‘‘కమల్‌ భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేశాడు. గణితం ఉపాధ్యాయుడికి పని భారం ఎక్కువ అవుతుండటంతో అతడు ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి వచ్చి, కొన్ని తరగతులు తీసుకుంటానని చెప్పాడు. దీంతో అతడికి అవకాశం ఇచ్చారు. అతడు గొప్పగా బోధిస్తున్నాడు. అంతేకాక విద్యార్థులు  పాఠాలను ఆస్వాదిస్తున్నారు. గణితం ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత వారానికి 17-18 పిరియడ్స్‌ తనకి ఇవ్వాలని అతడు కోరాడు’’ అని జిల్లా డిప్యూటీ డీఈవో సుధీర్‌ కల్రా తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కమల్‌ పాఠాలు బోధించడానికి అనర్హుడు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించాలంటే ఆ సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌ అయ్యి ఉండాలి.

అయితే, డిప్యూటీ డీఈవో సుధీర్‌.. కమల్‌కు మద్దతు ఇస్తున్నాడు. ‘‘అతడు తన విధులతో పాటు అదనంగా ఇది నిర్వర్తిస్తున్నాడు. బడి గంట కొడుతున్నాడు. సిబ్బందికి, ఉపాధ్యాయులకు నీటిని అందిస్తున్నాడు. వాటితో పాటు పాఠాలను బోధిస్తున్నాడు. అతడిలో గురువు లక్షణాలు ఉన్నాయి’’ అని అన్నారు. హరియాణాలో కమల్‌లా ఎక్కువ అర్హత కలిగిన ఎంతో మంది గ్రూప్‌-డిలో తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని, అలాగని వారిని దరఖాస్తు చేసుకోనివ్వకుండా అడ్డుకోలేమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని