చిన్నారితో బస్సు డ్రైవర్‌ చిందులు

ముద్దుముద్దుగా చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఒక్కోసారి మనం కూడా వాళ్ల భాషలోనే మాట్లాడుతూ చిన్నపిల్లల్లా మారిపోతుంటాం. వాళ్లను ఎత్తుకొని ముద్దు చేస్తూ వాళ్లు ఏం అడిగినా కాదనకుండా తెచ్చివ్వాలనిపిస్తుంది. ఇదంతా మనం ఖాళీగా ఉన్న సమయంలో..

Published : 02 Mar 2020 23:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముద్దుముద్దుగా చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఒక్కోసారి మనం కూడా వాళ్ల భాషలోనే మాట్లాడుతూ చిన్నపిల్లల్లా మారిపోతుంటాం. వాళ్లను ఎత్తుకొని ముద్దు చేస్తూ వాళ్లు ఏం అడిగినా కాదనకుండా తెచ్చివ్వాలనిపిస్తుంది. ఇదంతా మనం ఖాళీగా ఉన్న సమయంలో.. మరి పనిలో బిజీగా ఉన్నప్పుడు కూడా చిన్నారులతో అంతే సరదాగా ఉండగలమా..? అంటే అలా ఉంటేనే ప్రశాంతత ఉంటుందని అంటున్నాడో బస్సు డ్రైవర్‌.

ఫ్లోరిడాలోని ఓ బస్టాండ్‌ నుంచి బయలుదేరడానికి సిద్ధమైన ఓ బస్సులోకి ఎక్కుతున్న చిన్నారి తనకు ‘షేక్‌ ఇట్ ఆఫ్‌’ అనే పాట అంటే చాలా ఇష్టమని ఆ డ్రైవర్‌తో చెప్పింది. వెంటనే బస్సును పక్కకు పార్క్‌ చేసిన ఆ డ్రైవర్‌ ఆ చిన్నారి కోరిన పాట వేశాడు. చిన్నారి అతడి ముందు నిల్చొని డ్యాన్స్‌ చేస్తుండగా.. డ్రైవర్‌ తన సీట్లోనే ఉండి ఆమెతో పాటు స్టెప్పులు వేశాడు. వాళ్లిద్దరి డ్యాన్స్‌ అందర్నీ నవ్విస్తోంది. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియోను 2018లో ఆ చిన్నారి తల్లి బ్రెట్‌ అష్లే తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ‘నా కూతురు బస్సు ఎక్కే సమయంలో తనకు ‘షేక్‌ ఇట్‌ ఆఫ్‌’ పాట చాలా ఇష్టమని చెప్పింది. బస్సు డ్రైవర్‌ అంటే చాలా బిజీగా ఉంటారు. ఎంతో ఒత్తిడి ఉంటుంది. అలసిపోయి ఉంటారు. కానీ, నా కూతురు ఎమెర్సన్‌ అడగగానే తన పనులన్నీ మానుకొని ఆమెతో పాటు డ్యాన్స్‌ చేశారు. బస్సులో ప్రయాణికులు కూడా బాగా ఎంజాయ్‌ చేశారు’ అని పేర్కొంది. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బెస్ట్‌ చైర్‌ డ్యాన్స్‌ అవార్డు బస్‌ డ్రైవర్‌కు ఇవ్వాల్సిందేనని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. బస్‌ డ్రైవర్‌ నాకంటే గొప్పగా డ్యాన్స్‌ చేశాడని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని