
జనతా కర్ఫ్యూ... నిలిచిపోనున్న రైళ్లు
కరోనా నేపథ్యంలో రైల్వే శాఖ నిర్ణయం
దిల్లీ: కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఈ నెల 22న చేపట్టనున్న జనతా కర్ఫ్యూలో భాగంగా రైళ్లు నిలిచిపోనున్నాయి. ఏ పాసింజర్ రైలు కూడా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బయల్దేరబోదని రైల్వేశాఖ స్పష్టంచేసింది. అప్పటికే ప్రయాణంలో ఉన్న రైళ్లు మాత్రం గమ్యస్థానం చేరే వరకు అనుమతిస్తారు. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, సికింద్రాబాద్ సబర్బన్ రైలు సర్వీసులు పరిమితంగానే సేవలు అందించనున్నాయి. మరోవైపు మార్చి 22 నుంచి మెయిల్/ఎక్సప్రెస్ రైళ్లలో ఆన్బోర్డ్ కేటరింగ్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఫుడ్ ప్లాజాలు, రీఫ్రెష్మెంట్ రూములు, జన ఆహార్, సెల్ కిచెన్లను సైతం మూసివేస్తున్నట్తు తెలిపింది.
మరో 90 రైళ్లు రద్దు
కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే మరో 90 రైళ్లను రద్దు చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా నిన్న 84 రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 90 రైళ్లను కూడా రద్దు చేయడంతో రద్దైన రైళ్ల సంఖ్య 245కు చేరింది. మార్చి 20 నుంచి మార్చి 31 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.