Updated : 22/03/2020 20:56 IST

జనతా కర్ఫ్యూపై జనం మాట 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్‌ పెద్ద యుద్ధమే ప్రకటించింది. యావత్‌ భారతావని చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టిన ఈ జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేశారు. ఈ వైరస్‌ గొలుసును ఛేదించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును తూ.చ. తప్పకుండా పాటించిన జనం తమ సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. తద్వారా ప్రపంచానికి ఐక్యతా గళం వినిపించారు. జనతా కర్ఫ్యూపై నెటిజన్ల స్పందనలు కోరుతూ ఈనాడు.నెట్‌ ఇచ్చిన పిలుపునకు నెటిజన్ల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. ఈ కర్ఫ్యూను మరిన్ని రోజులు పొడిగించడంతో పాటు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి బాధ్యతగా వ్యవహరించడం వల్లే ఈ మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని స్థూలంగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. వారి అభిప్రాయాల తరహాలోనే తెలుగు రాష్ట్రాలు ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 13వేల మందిని పొట్టనబెట్టుకున్న కొవిడ్‌-19 మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతూ వేలాది మంది నెటిజన్లు కామెంట్లు పోస్ట్‌ చేశారు. వారందరికీ ఈనాడు.నెట్‌ తరఫున కృతజ్ఞతలు. అందరి స్పందనలూ ఇవ్వలేకపోయినా స్థూలంగా వ్యక్తమైన అభిప్రాయాల సమాహారం ఇదీ.. 

* ‘‘జనతా కర్ఫ్యూ.. పాటిద్దాం! పోయేదేముంది కరోనా సంకెళ్లు తప్ప! ఈ నినాదంతో చుట్టుపక్కల వారందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో వైద్యశాఖ, పారిశుద్ధ్య ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతుంటే.. ఆ స్ఫూర్తితో వైరస్‌ని జయించగలమని నమ్మకం ఏర్పడింది’’

* ‘‘మార్చి 31 వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. ఇలాంటి మంచి ఆలోచన చేసిన మన ప్రధాని మోదీ గారికి హ్యాట్సాఫ్‌!’’

*  ‘‘స్వాతంత్ర్యం అనంతరం మరోసారి మనం ఐక్యతను చాటాం. ఇలాంటి సమయాల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సర్వీసులను వారితో కల్పించేందుకు ఉపయోగించాలి. భారతీయుల శక్తియుక్తుల్ని నిరూపించాల్సిన సమయమిదే’’

*  ‘‘ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయం. కానీ, ఈ ఒక్కరోజే సరిపోదు. ఈ కర్ఫ్యూని కనీసం రెండు వారాలు పాటించాల్సిన అవసరం ఉంది. నిత్యావసరాలకు సంబంధించిన సంస్థలను మాత్రమే అనుమతించాలి. మన లక్ష్యం ఒక్కటే. కొవిడ్‌-19 వైరస్‌ను ఛేదించి దేశాన్ని కాపాడుకోవడమే’’ 

*  ‘‘నేను బెంగళూరులో ఉంటున్నా. తరచుగా వాహనాల శబ్ధం మోతే ఉండేది. కానీ, ఈ రోజు పక్షుల కిలకిల శబ్ధాలు వినపడ్డాయి. శబ్ధ, గాలి కాలుష్యానికి తావులేని గ్రామంలో ఉన్నట్టు అనుభూతి పొందాను. కొవిడ్‌ 19 వైరస్‌తో సంబంధం లేకుండా నెలకొకసారైనా ఇలా కర్ఫ్యూ పాటిస్తే పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేసినవాళ్లమవుతాం’’

*  ‘‘వస్తువులను తాకొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలి. అపార్టుమెంట్లలో తలుపులు తెరిచేటప్పుడు సాధ్యమైతే టిష్యూ/ పేపర్లను వాడండి. లిఫ్ట్‌లను ఆన్‌ చేసేందుకు టూత్‌ పిక్స్‌ వాడండి. వాడిన వెంటనే వాటిని చెత్తబుట్టలో వేయండి. అంతేగానీ వాటిని స్నానపు గదుల్లో, పైపులకు అడ్డంగా వేయొద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. నిత్యావసరాలు, మందులు తెచ్చేందుకు వృద్ధులకు సాయం చేయండి’’

*  ‘‘నగరాల్లో ఫర్వాలేదు గానీ చిన్న పట్టణాలు, గ్రామాల్లో కరోనా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా లక్షణాలు ఏమిటనే విషయాలను ప్రజల్లో అవగాహన ఉండటం లేదు. అందువల్ల ప్రభుత్వం, ఎన్జీవో సంస్థలు చొరవ తీసుకొని గ్రామాల్లో అవగాహన కల్పించాలి. ఈ కర్ఫ్యూ ఇంకా రెండు వారాలు ఇలాగే కొనసాగిస్తే మంచిది’’

*  ‘‘కరోనాను తరిమికొట్టేందుకు జనతా కర్ఫ్యూ ఒక్క రోజు పాటిస్తే చాలదు. దీనికి మూడు, నాలుగు వారాలు అవసరం. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలిచేలా చేసిన ఈ కార్యక్రమం చాలా బాగుంది. జనతా కర్ఫ్యూ అర్థం భారత్‌ నుంచి వైరస్‌ను తరిమికొట్టడం. జయహో జనతా కర్ఫ్యూ.. జైహింద్‌!’’

*  ‘‘కూలీలు, దినసరి కార్మికులు, పేదల కోసం సరైన ఏర్పాట్లు చేసి కర్ఫ్యూని కొనసాగిస్తే మంచిది’’

 

* ‘‘ఒకరోజు కర్ఫ్యూతో సమస్య పరిష్కారం కాదు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతతో వ్యవహరించి అక్కడి ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చి నిర్బంధంలోకి వెళ్లాలి. రెండోది.. ప్రతిఒక్కరూ శుభ్రత పాటించాలి. దాంతో పాటు సామాజిక దూరం పాటించాలి. ఇలా కనీసం రెండు వారాలు పాటిస్తే చాలు. అందువల్ల కరోనాపై పోరాటం సాగించడం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని పనిచేయాలి’’

* ‘‘ప్రపంచమంతా ఒకవైపు.. కరోనా ఒకవైపు. ఈ మహమ్మారి మానవ మనుగడపై సవాలు విసిరిన నేపథ్యంలో భారత్ స్వచ్ఛందంగా ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటించి జాతి సమైక్యతను చాటింది. ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి నెట్టేస్తూ అత్యధిక జనాభా గల భారత్‌ తనకు తాను గృహ నిర్భంధం విధించుకుని కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రయత్నించి విజయం సాధించింది. ఏ అంతర్జాతీయ విపత్తునైనా సమర్థంగా సమైక్యంగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధమవుతూ ఎదుర్కోగలమన్న సంకేతాన్ని ప్రపంచం ముంగిట ఢంకా భజాయించి మ‌రీ చాటి చెప్పింది భారత్. ఈ  జనతా కర్ఫ్యూతో కరోనాకు చావుదెబ్బ రుచి చూపించింది’’

*  ‘‘మంచి నిర్ణయం. మనుషులంతా ఇలా ఐక్యంగా ఉండి పట్టుదలతో తమని తాను కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడేలా పనిచేస్తే కరోనానే కాదు దేన్నయినా పరిష్కరించుకోగలం’’

* ‘‘ఇది చాలా మంచి ఆలోచన. దీన్ని ఇలాగే నెలలోని నాలుగు ఆదివారాలు కొనసాగిస్తే అసలు కరోనా అనే పదం కూడా వినబడదు. దీనిపై ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. పోలీసులు, మిలటరీ వాళ్లు చేసిన కర్ఫ్యూని చూశాం. కానీ, జనతా కర్ఫ్యూని ఇప్పుడు చూశాం. దేశప్రజలు ఏవిధంగా మోదీ పిలుపు మేరకు స్పందించారో అర్థమవుతోంది’’

* ‘‘కరోనా కట్టడికి ఇదో మంచి చర్య. 52 ఏళ్ల పైబడిన వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి నుంచే పనిచేసేలా, లేదంటే సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’

* ‘‘వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ని తాత్కాలికంగా నిలిపివేయాలి. అసత్య వార్తల ప్రచారంతో కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’’

పూర్తి స్పందనల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని