నిర్బంధంలో ఫోన్‌ వాడుతున్నారా.? జర జాగ్రత్త

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలంతా నిర్బంధంలోకి వెళ్లారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు..? కాసేపు టీవీ చూస్తారు. చిన్నాచితకా పనులేమైనా ఉంటే చక్కబెట్టుకుంటారు.

Published : 24 Mar 2020 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలంతా నిర్బంధంలోకి వెళ్లారు. మరి ఇంట్లో ఉన్న జనం ఏం చేస్తారు..? కాసేపు టీవీ చూస్తారు. చిన్నాచితకా పనులేమైనా ఉంటే చక్కబెట్టుకుంటారు. కాసేపు నిద్రపోతారు. మరి మిగితా సమయంలో ఏం చేస్తారు..? ఇంకేం చేస్తారు.. ఫోన్‌ వాడుతూ ఉంటారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. అలా చేస్తే మీరెన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పటికీ పరిశుభ్రత పాటించకపోతే ఫలితం శూన్యమే అంటున్నారు వైద్య నిపుణులు. మీరు వాడే ఫోన్‌ను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

టాయిలెట్‌ సీటు కంటే ప్రమాదకరం

టాయిలెట్‌ సీటు కంటే పదిరెట్లు అపరిశుభ్రంగా ఉండే ఫోన్‌ మీ చేతిలోనే ఉంటుందన్న విషయం మీకు తెలుసా..? అంటే.. శరీరంలో ఓ భాగంగా మారిపోయిన సెల్‌ఫోన్‌ కంటే టాయిలెట్‌ సీటు పదిరెట్లు మేలన్న మాట. అవును.. ఇది మేం చెబుతున్న మాట కాదు.. పరిశోధనలు నిరూపించిన సత్యం. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా..? ఇది కరోనా కాలం.. ఈ వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకూ దీనికి విరుగుడు దొరకలేదు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష అని నిపుణులు సైతం సూచిస్తున్నారు. అందుకే చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, తప్పనిసరిగా శానిటైజర్‌, సబ్బులాంటివి వాడాలని పదేపదే చెబుతున్నారు. వీటన్నింటితో పాటు ఎప్పటికప్పుడు  సెల్‌ఫోన్‌ను శుభ్రం చేసుకుంటే వైరస్‌ నుంచి మరింత రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సెల్‌ఫోన్‌పై కరోనా కాలం మూడు రోజులు

ప్లాస్టిక్‌పై కరోనా వైరస్‌ గరిష్ఠంగా మూడు రోజుల పాటు జీవించగలదు. ఈ వైరస్‌ను మీ నుంచి దూరంగా ఉంచాలంటే మీ సెల్‌ఫోన్‌ స్క్రీన్‌, వెనక భాగాన్ని బాగా శుభ్రం చేయాలి. ఐసోప్రొపైల్ ఆల్కహాల్, శానిటైజర్‌తో మెత్తటి బట్టను వేసి శుభ్రంగా తుడవాలి. డెటాల్, క్రిమిసంహారక ద్రవాలు వంటివి ఉపయోగించవద్దు. సెల్‌ఫోన్‌ను శుభ్రం చేసిన టవల్‌ను మళ్లీ శరీరానికి ఉపయోగించకూడదు. ఈ ప్రక్రియను రోజుకు కనీసం ఒకటి లేదా రెండుసార్లు చేయాలి. దీంతో పాటు మీ ఇంట్లో స్విచ్‌ బోర్డులు, డోర్‌ కర్టన్లు, ఇతర ఫర్నిచర్‌ను కూడా శుభ్రం చేసుకోవడం మేలని వైద్యులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని