కరోనా మళ్లీ తిరగబెడుతోందా..? 

కరోనా బారిన పడిన ప్రపంచానికి మరో కొత్త తలనొప్పి ఎదురువుతోంది.. కరోనా వైరస్‌ పీడను వదిలించుకున్న వారిలో మళ్లీ వైరస్‌ కనిపిస్తున్నట్లు, లక్షణాలు తిరగబెడుతున్నట్లు నిపుణులు సందేహం..... 

Published : 06 May 2020 01:35 IST

హైదరాబాద్‌ : కరోనా బారిన పడిన ప్రపంచానికి మరో కొత్త తలనొప్పి ఎదురువుతోంది.. కరోనా వైరస్‌ పీడను వదిలించుకున్న వారిలో మళ్లీ వైరస్‌ కనిపిస్తున్నట్లు, లక్షణాలు తిరగబెడుతున్నట్లు నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ మళ్లీ తిరగబెడుతుందా.. లేదా తెమడ పరీక్షల్లో ఫలితాలు తప్పుగా వస్తున్నాయా అనే విషయంలో శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందినా.. 

వాస్తవానికి కరోనా రోగి కోలుకున్న తరువాత పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో బాధితుడిని ఇంటికి పంపిస్తున్నారు. కొన్నాళ్లు స్వీయనిర్భంధంలో ఉండాలని చెబుతున్నారు. కానీ అలా ఇంటికి వెళ్లిన కొద్దిమందిలో వ్యాధి లక్షణాలు తిరగబెడుతున్నాయి.. దీంతో కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి శరీరంలో వ్యాధినిరోధక శక్తి అభివృద్ధి చెందదా.. ఆ వ్యక్తి మరోసారి కరోనా బారిన పడాల్సిందేనా.. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా  ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోంది.. ముఖ్యంగా వైరస్‌ నుంచి విజయవంతంగా కోలుకున్న దక్షిణ కొరియాలో ఎక్కువగా కనిపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని చెప్పడానికి బలమైన సమాచారం ఏదీ లేదని అమెరికా లీ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివేన్షన్‌ సంస్థ తెలుపుతోంది. ఒకసారి వ్యాధి లక్షణాలు కనుమరుగై కోలుకునే సమయంలో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏలు ఆ వ్యక్తిలో కనిపించినా వ్యాధి ఉన్నట్లు కాదని చెబుతోంది ఈ సంస్థ.. కరోనా బారిన బడి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కరోనా రాదనే  హామీ ఏమీ లేదు.. కోలుకున్న వ్యక్తిలో రోగనిరోధకశక్తి అభివృద్ధి చెంది.. మళ్లీ వ్యాధి వచ్చినా ఇది సంరక్షిస్తుందని చెప్పడానికీ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. 

పీసీఆర్‌ పరీక్షలు సరిపోతాయా.. 

ఇటీవల ఎనల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ పరిశోధనల్లో కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తి కఫం, మలంలో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. ఈనేపథ్యంలో రోగులకు చేసే తెమడ పరీక్షలు నమ్మదగినవేనా.. మరిన్ని పరీక్షలు చేయాలా.. అనే సందేహాలు వస్తున్నాయి.. రోగిని డిశ్ఛార్జీ చేసే ముందు 24 గంటల వ్యవధిలో నిర్వహించే పీసీఆర్‌ పరీక్షలు రోగి కోలుకున్నట్లు నిర్ధారించడానికి సరిపోతాయా.. అనే సందేహాలకు తావిస్తున్నాయి.. 

వైరస్‌ రూపాంతరం చెందితే.. 

ఇటీవల చైనాలో 133 మంది కొవిడ్‌ రోగుల గొంతు, ముక్కు నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తే 22 మందిలో నెగిటివ్‌ వచ్చింది. కానీ వారి కఫం, మలంలో 13 నుంచి 39 రోజుల వరకు వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయి. రోగం నయమైనా విసర్జకాల్లో కొన్ని రోజులు ఆనవాళ్లు కనిపించడం సహజ ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఇది వైరస్‌ జన్యుపదార్థమే కాని వైరస్‌ కాదని న్యూయార్క్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తులను డిశ్ఛార్జీ చేయడానికి ముందు నిర్వహించే సీపీఆర్ పరీక్షల్లో రెండుసార్లు వరుసగా నెగిటివ్‌ రావాలి. కొన్ని కారణాలతో ఈ పరీక్షలు విఫలం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ రూపాంతరం చెందడంతో పరీక్షలకు దొరకకపోయే అవకాశముంది. కోలుకున్న వారికి పాజిటివ్‌ వస్తే వారి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి చెందుతుందా అనేదానిపై ఇపుడప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని