ఇంటి వద్దకే మద్యం సరఫరా!

ఇంటి వద్దకే మద్యం సరఫరా లేదా పరోక్ష అమ్మకాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది. మద్యం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం ఆంక్షలు పటిష్ఠంగా అమలయ్యేందుకు తమ సలహాను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది....

Published : 08 May 2020 15:29 IST

రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలన్న సుప్రీం కోర్టు

దిల్లీ: ఇంటి వద్దకే మద్యం సరఫరా లేదా పరోక్ష అమ్మకాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది. మద్యం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం ఆంక్షలు పటిష్ఠంగా అమలయ్యేందుకు తమ సలహాను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌లో మద్యం అమ్మకాలకు అనుమతినివ్వడం సాధారణ పౌరుడి జీవితంపై ప్రభావం చూపిస్తోందని దాఖలైన పిల్‌ను న్యాయమూర్తులు అశోక్‌ భూషణ్‌, సంజయ్‌ కిషన్‌కౌల్‌, బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది.

‘మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయం. భౌతిక దూరం పాటించేందుకు ఇంటి వద్దకే మద్యం సరఫరా లేదా పరోక్ష అమ్మకాలను రాష్ట్రాలు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఇంటి వద్దకే మద్యం సరఫరాపై చర్చలు కొనసాగుతున్నాయి. మమ్మల్ని ఏం చేయమంటారు?’ అని న్యాయమూర్తి ఎస్‌కే కౌల్‌ ప్రశ్నించారు.

పరిమిత సంఖ్యలోనే మద్యం దుకాణాలు తెరవడంతో భౌతిక దూరం అమలు కష్టమవుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దీపక్‌ సాయి అన్నారు. ‘మద్యం అమ్మకాల వల్ల సామాన్యుడి జీవితంపై ప్రభావం పడొద్దు. విక్రయాలపై కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు స్పష్టతనివ్వాలి’ అని కోరారు.

మద్యాన్ని ఇంటికి వద్దకే సరఫరా చేసే అంశాన్ని జొమాటో పరిశీలిస్తోందని ఇంతకుముందే కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా అందుకు సంబంధించిన చట్టపరమైన నిబంధన భారత్‌లో లేదని తెలిసింది. నిబంధనల మార్పు కోసం కొందరు లాబీయింగ్‌ చేస్తున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని