ప్రభుత్వ సాయం లేకుండా.. నదిపై బ్రిడ్జి నిర్మించారు!

గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించుకుంటాం. చిన్నచిన్న సమస్యలైతే గ్రామస్థుల ఐకమత్యంతో చందాలు వేసుకుని

Updated : 09 May 2020 13:51 IST

అసోం: గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించుకుంటాం. చిన్నచిన్న సమస్యలైతే గ్రామస్థుల ఐకమత్యంతో చందాలు వేసుకుని వాటిని తామే పరిష్కరించుకుంటారు. అదే పెద్దవైతే పాలకుల సాయం కోసం ఎన్నాళ్లైనా వేచి చూడాల్సిందే. అలాంటిది అసోంలోని పది గ్రామాల ప్రజలు మాత్రం ప్రభుత్వ సాయం లేకుండానే ఏకంగా నదిపై బ్రిడ్జే నిర్మించారు. ఐకమత్యమే మహా బలం అనే నానుడిని చేతల్లో చూపించి శభాష్‌ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే... 

అసోంలోని కామ్‌రూప్‌ జిల్లాలో జల్‌జలి నది ప్రవహిస్తోంది. ఆ నది గట్టున పది గ్రామాలు ఉన్నాయి. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే చెక్కతో చేసిన నాటు పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి ప్రజలు నిత్యావసరాలు, ఆసుపత్రికి, పాఠశాలకు వెళ్లాలన్నా జల్‌జలి నది దాటాల్సిందే. వారికి ఇంకో మార్గం లేదు. వరద ఉద్ధృతి ఎక్కువైతే నదిలో కొట్టుకుపోయే పరిస్థితి. అందులోనూ నాటు పడవలో నదిలో వెళ్తున్నంత సేపూ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. ఏటా వర్షాకాలంలో వరద ఉద్ధృతికి నదిలోపడి వందలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు.  

దీంతో నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం అనేకసార్లు పాలకులను వేడుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. పలుమార్లు అధికారులు హామీ ఇచ్చినా నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో పది గ్రామాల ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. తామే సొంత డబ్బుతో బ్రిడ్జిని నిర్మించుకుకోవాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే పది గ్రామాల్లోని ఏడువేల మంది చందాలు వేసుకుని డబ్బు కూడగట్టుకున్నారు. ప్రభుత్వం సాయం లేకుండా.. కేవలం సొంత డబ్బులు సమకూర్చుకుని నదిపై బ్రిడ్జి నిర్మించుకున్నారు. దాదాపు అర కిలోమీటరు పొడవున కర్రలతో బ్రిడ్జి నిర్మించుకుని ఔరా అనిపించుకున్నారు. ఇప్పుడు ఎలాంటి ప్రమాదాలు లేకుండా సాఫీగా రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో సైతం తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ సందర్భంగా గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కాంక్రీటు బ్రిడ్జిని నిర్మిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని