30 ఏళ్ల తర్వాత ఆమె కాదు అతడు

పొత్తి కడుపులో నొప్పి వస్తుందని ఓ మహిళ ఆస్పత్రికి వెళితే అసలు విషయం బయటపడింది. ఇన్నాళ్లు మహిళగా ఉన్న ఆమె.. ఆమె కాదని అతడని తేలింది. విషయం తెలుసుకున్న బాధితురాలి...

Published : 26 Jun 2020 17:58 IST

కడుపు నొప్పని వెళితే అసలు విషయం బయటపడింది

కోల్‌కతా: పొత్తి కడుపులో నొప్పి వస్తోందని ఓ మహిళ ఆస్పత్రికి వెళితే అసలు విషయం బయటపడింది. ఇన్నాళ్లు మహిళగా ఉన్న ఆమె.. ఆమె కాదని అతడని తేలింది. విషయం తెలుసుకున్న బాధితురాలి చెల్లి సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె కూడా పురుషుడనే తేలింది. దీంతో వారిద్దరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆండ్రోజెన్‌ ఇంటెన్సివిటి సిండ్రోమ్‌ (ఒక మనిషి జన్యుపరంగా పురుషుడిగాగా పుట్టినా శారీరక లక్షణాలన్నీ మహిళవిగా ఉండటం) కారణంగా ఇలా జన్మించారని తెలిసింది. 

కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల బర్భమ్‌(సదరు వ్యక్తి) తొమ్మిదేళ్ల క్రితం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఆమె నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బయటకు చూడటానికి ఆ వ్యక్తి మహిళగా కనిపిస్తున్నా జన్యుపరంగా మగాడని తేలింది. గొంతు, శారీరక అవయవాలన్నీ మహిళలాగే ఉన్నా.. పుట్టినప్పటి నుంచీ అంతర్గత మహిళలకు ఉండాల్సిన అవయవాలు అభివృద్ధి కాలేదు. అలాగే ఆమెకు జీవితంలో ఎప్పుడూ నెలసరి రాలేదని తెలిసింది. కడుపునొప్పి వస్తోందని ఆస్పత్రిలో చేరితే వైద్య పరీక్షలు నిర్వహించామని, అందులో సదరు వ్యక్తికి వృషణాలు ఉన్నాయని గుర్తించి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆ వృషణాలకు క్యాన్సర్‌ సోకిందని వెల్లడించారు.

‘ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి, సుమారు 22 వేల మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఆడవారి పుట్టుకకు కారణమయ్యే XX క్రోమోజోమ్‌లు కాకుండా ఆ వ్యక్తిలో XY క్రోమోజోమ్‌లు ఉన్నాయి. అయితే, అంతర్గత అవయవాల్లో వృషణాలు అభివృద్ధి జరగకపోవడంతో ఆ వ్యక్తికి మహిళా అవయవాలు ఏర్పడాయి. ప్రస్తుతం కీమో థెరపీ అందిస్తున్నాం, పరిస్థితి నిలకడగానే ఉంది. గతంలో ఆ దంపతులు పిల్లలు కావాలని ప్రయత్నించినా అది కుదరలేదు. మరోవైపు ఆ వ్యక్తికి ఇద్దరు మేనత్తలు ఉన్నారని తెలిసింది. వాళ్లు కూడా ఈ విధంగానే జన్యులోపాలతో జీవిస్తున్నారు. బహుశా ఇది వాళ్ల జన్యువుల్లోనే ఉండి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు భార్య భర్తాల్లా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండమని వివరిస్తున్నాం’ అని అక్కడి వైద్యులు పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని