కృత్రిమ మేధ.. సాగించింది హవా

కరోనా మహమ్మారి కారణంగా 2020లో వాటి వినియోగం భారీగా పెరిగింది. ఆసుపత్రుల్లో రోగుల పరీక్షలు మొదలు వైరస్‌ను నివారించే రసాయనాలను చల్లడం వరకు....

Published : 24 Dec 2020 00:43 IST

2020లో భారీగా పెరిగిన రోబోలు, డ్రోన్ల వినియోగం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవాళి రూపొందించిన అద్భుత ఆవిష్కరణ కృత్రిమ మేధ. వివిధ రంగాల్లో మానవుల ప్రమేయం లేకుండా కావాల్సిన పనిని చేసిపెట్టే రోబోలు, డ్రోన్ల సేవలను మనం చాలా కాలం నుంచే పొందుతున్నాం. కరోనా మహమ్మారి కారణంగా 2020లో వాటి వినియోగం భారీగా పెరిగింది. ఆసుపత్రుల్లో రోగుల పరీక్షలు మొదలు వైరస్‌ను నివారించే రసాయనాలను చల్లడం వరకు.. విద్యార్థులకు పట్టాల ప్రదానం నుంచి దుకాణాల నిర్వహణ వరకు ఈ ఏడాది వివిధ దేశాల్లో రోబోలు, డ్రోన్లు విశేష సేవలందించాయి. సామాజిక దూరం పాటించడం, వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు అనేక దేశాల్లో డ్రోన్లు, రోబోల వినియోగం పెరిగిపోయింది. 

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అక్కడికి రాకుండానే రోబోల సాయంతో వీడియో కాల్ ద్వారా 170 మందికి పట్టాలు అందించారు. కొవిడ్‌పై అప్రమత్తత కల్పించేందుకు జపాన్‌లో ఓ రోబోను రూపొందించారు. ఎవరైనా మాస్కు ధరించకుంటే వారి దగ్గరకు వెళ్లి మాస్కు ధరించాలని ఈ రోబో సూచిస్తుంది. జపాన్‌లోని పలు క్వారంటైన్ కేంద్రాల్లో రోగులను పలకరించడం సహా నేలను శుభ్రం చేసేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. చైనా, నెదర్లాండ్స్‌లోని కొన్ని హోటళ్లలో వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకునేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. ఇజ్రాయిల్‌, రష్యాల్లో మానవ ప్రమేయం లేకుండా కరోనా రసాయనాలను చల్లే యంత్రాలను రూపొందించారు. లండన్‌లో కొన్ని రోబోలు టైలర్‌ అవతారమెత్తి కొలతలు కూడా తీసుకుంటున్నాయి. 

కొలంబియాలో వినియోగదారులకు వస్తువులను అందించేందుకు రోబోలను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల వినియోగదారుల ఇంటి వద్దే వస్తువులను జారవిడిచే డ్రోన్లను రూపొందించారు. భారత్‌లోనూ ఈ ఏడాది రోబోలు, డ్రోన్ల వినియోగం బాగానే పెరిగింది. దేశంలోని పలు ఆసుపత్రుల్లో రోగుల శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేసుకోవడం, రోగులను వార్డులకు తీసుకువెళ్లడం వంటి సేవలను అందిస్తున్నాయి.

ఇవీ చదవండి...

2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు..!

కరోనా వేళ.. జల్లికట్టుకు అనుమతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని