Updated : 08/09/2021 12:35 IST

Vande Bharat Trains: వందకుపైగా వందేభారత్‌ రైళ్లు

అమృత  మహోత్సవంలో హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌లు

హైదరాబాద్‌: శతాబ్దిని తలదన్నే వేగం, మెట్రోని మించిన ఆధునికత వందేభారత్‌ (ట్రైన్‌-18) ఎక్స్‌ప్రెస్‌ల సొంతం. గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లే ఈ సెమీహైస్పీడ్‌ రైళ్లు వందకు పైగా అందుబాటులోకి రానున్నాయి. అమృత మహోత్సవాల్లో భాగంగా దశలవారీగా వీటిని పట్టాలు ఎక్కించేలా రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందించింది. 44 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. మరో 58 బండ్లకు రైల్వేశాఖ తాజాగా టెండర్లు ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి వస్తాయని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

శతాబ్ది రైళ్ల స్థానంలో..
దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లు అనగానేే గుర్తుకొచ్చేవి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లే. ఎక్కువగా దిల్లీ, ముంబయి వంటి నగరాల నుంచి ఇవి రాకపోకలు సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకున్న ఏకైక శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌-పుణె మధ్య నడుస్తోంది. తెలంగాణ, ఏపీలో ప్రధాన నగరాల మధ్య.. ఇక్కడి నగరాల నుంచి దేశంలోని దూరప్రాంత నగరాలకు ఈ బండ్లు వేయాలని చాలాకాలంగా డిమాండునాన  రైల్వేశాఖ పట్టించుకోలేదు. అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో శాఖలో ఒక్కో కీలక నిర్ణయం తీసుకుంటోంది. రైల్వేకి సంబంధించి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లపై దృష్టి పెట్టింది. వారానికొకటి చొప్పున 75 వారాల్లో 75 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను దేశంలోని అన్ని ప్రాంతాల ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ప్రధాని మోదీ ఇటీవల రైల్వేశాఖను ఆదేశించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిన 44 ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి.. వచ్చే ఫిబ్రవరి, మార్చి నాటికి నమూనా రైళ్లు అందుబాటులోకి వస్తాయని, వాటికి ఆమోదం రాగానే మిగిలిన రైళ్లు సిద్ధం అవుతాయని పెరంబూరు ఇంటిగ్రల్‌ కోచ్‌ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌)కి చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కి తెలిపారు. ప్రస్తుత శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలెక్కి చాలాకాలమైనందున వాటి స్థానంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టాలని రైల్వేబోర్డు భావిస్తోంది. 

ప్రత్యేకతల కలబోత
మెట్రోకి మించిన హంగులతో ఉంటాయీ రైళ్లు. దాదాపు 16 బోగీలుండే ఏసీ రైల్లో.. ప్రతి బోగీలో వై-ఫై. ప్రయాణికులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వాటంతట అవే తెరుచుకునే తలుపులు, సీట్లో కూర్చుని కావల్సినవైపు తిరగగలిగే సౌలభ్యం, పెద్ద అద్దాలతో కిటికీలు, విమానాల్లో తరహా బయోటాయిలెట్లు.. ఇలా అనేక ప్రత్యేకతలుండే ఈ రైళ్లు గంటకు 160-180 కి.మీ. గరిష్ఠవేగంతో పరుగులు తీస్తాయి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణసమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో ఒక జత మాత్రమే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇవి దిల్లీ-వారణాసి మధ్య తిరుగుతున్నాయి. కొత్తగా తయారుచేసే వాటిని మరింత ఆధునీకరించి ట్రైన్‌-20గా పట్టాలు ఎక్కించాలని రైల్వేశాఖ భావిస్తోంది. 

మనకూ ప్రాధాన్యం..
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌-విజయవాడ, సికింద్రాబాద్‌-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-తిరుపతి, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-తిరుపతి మధ్య అదే విధంగా సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నంల నుంచి దిల్లీ వంటి ప్రధాన నగరాలకు వేగవంత రైళ్ల డిమాండ్‌ ఉంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు తయారయ్యాక రైల్వేబోర్డు జోన్లకు కేటాయింపు చేస్తుందని..పెద్దసంఖ్యలో రైళ్లు రానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నట్లు ఐసీఎఫ్‌ పెరంబూర్‌ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 2022 ఆగస్టులో అమృత మహోత్సవాలు ముగిసేలోపే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలు ఎక్కడం ప్రారంభం అవుతుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని