Covid Third Wave: మూడో ముప్పు లేనట్టే!

భారత్‌కు కొవిడ్‌ మహమ్మారి మూడో ఉద్ధృతి ముప్పు తప్పినట్లేనా? ఒకవేళ వచ్చినా.. అది రెండో ఉద్ధృతి స్థాయిలో ఉండబోదా?..

Updated : 24 Nov 2021 10:50 IST

ఒకవేళ వచ్చినా.. రెండో ఉద్ధృతి స్థాయిలో ఉండదంటున్న నిపుణులు

దిల్లీ: భారత్‌కు కొవిడ్‌ మహమ్మారి మూడో ఉద్ధృతి ముప్పు తప్పినట్లేనా? ఒకవేళ వచ్చినా.. అది రెండో ఉద్ధృతి స్థాయిలో ఉండబోదా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం ‘అవును’ అనే సమాధానమిస్తున్నారు నిపుణులు. రెండో ఉద్ధృతి సమయంలోనే దేశంలో ఎక్కువమందికి కరోనా సోకడం, తర్వాత నుంచి టీకా పంపిణీ వేగంగా సాగుతుండటం వంటివి ఇందుకు దోహదపడుతున్నాయని వారు తెలిపారు. కరోనా నుంచి కోలుకొని, తర్వాత టీకా కూడా తీసుకున్నవారిలో మిశ్రమ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతోందని.. అది కూడా మూడో ముప్పు నివారణలో అత్యంత కీలకంగా పనిచేస్తోందని వివరించారు. వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండే కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తే మాత్రం మరో ఉద్ధృతి తప్పకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. శీతాకాలం ఆరంభమైన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతనూ నొక్కిచెప్పారు.

దుర్గాపూజ, దీపావళి వంటి పర్వదినాల కోసం జనం ఎక్కువగా గుమిగూడే అవకాశాలుండటంతో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో భారత్‌లో మూడో ఉద్ధృతి ఉచ్ఛస్థాయిలో ఉండే ముప్పుందని గతంలో చాలామంది నిపుణులు అంచనావేశారు. కానీ దేశంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 46 రోజులుగా 20 వేలకు దిగువనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పలువురు నిపుణులు స్పందించారు. ‘‘డిసెంబరు చివరి నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశముంది. కానీ రెండో ఉద్ధృతి స్థాయిలో పరిస్థితులు తీవ్రంగా ఉండబోవు. మరింత వేగంగా విస్తరించే వేరియంట్‌ పుట్టుకొస్తే తప్ప.. దేశానికి మూడో ముప్పు తప్పినట్లే’’ అని సోనీపత్‌లోని అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ గౌతమ్‌ మేనన్‌ పేర్కొన్నారు. రెండో ఉద్ధృతిలోనే ఎక్కువమంది భారతీయులు కరోనా బారినపడటం.. ఇప్పుడు రక్షణఛత్రంలా పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దానికితోడు టీకాల పంపిణీ వేగంగా సాగడం దోహదపడుతోందని చెప్పారు. ముందే కరోనా బారినపడి, కోలుకున్నాక టీకా తీసుకున్నవారికి.. వ్యాక్సిన్‌ మాత్రమే తీసుకున్నవారితో పోలిస్తే కొవిడ్‌ నుంచి అధిక రక్షణ లభిస్తోందని తెలిపారు. భారత్‌లో మూడో ఉద్ధృతి ఇప్పటికే వచ్చి, సెప్టెంబరులోనే ముగిసి ఉండొచ్చని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్‌సీ) ప్రొఫెసర్‌ సీతాభ్ర సిన్హా అంచనా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని