Ap News: ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల సమ్మె

ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది.

Updated : 21 Jan 2022 17:15 IST

అమరావతి: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. ఇవాళ సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరనున్నాయి. అలాగే ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం అసోసియేషన్‌ హాలులో మరోసారి భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. సీఎస్‌ను కలిసి వినతి పత్రం అందించారు.

మరోవైపు ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని తెలిపింది. బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. తాము మాత్రం పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి తేవొద్దని పేర్కొంది.

ఇప్పటికీ అదే అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాం..

‘‘పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విషయంలో ఏ విధమైన వైఖరితో ఉండాలనే అంశం పైన చర్చించాం. పాత జీతాలనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరనున్నాం. ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం సమంజసం కాదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో సీఎస్ ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాలి. కానీ సీఎస్ ఆ బాధ్యతల్లో విఫలమయ్యారు. ఆ విషయాన్నే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రస్తావించారు. సీఎస్‌ను ఉద్దేశించి సూర్యనారాయణ చేసిన కామెంట్లు ఆయన వ్యక్తిగతం కాదు. అది అసోసియేషన్ అభిప్రాయం. సీఎస్ మీద ఇప్పటికీ అదే అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాం. ఐఏఎస్ అధికారుల సంఘం చేసిన ఆరోపణలు నిరాధారం’’ అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని