Corona Vaccine: టీకా వేయించుకో.. టీవీ, వాషింగ్‌ మిషన్‌, ఫ్రిడ్జ్‌ గిఫ్ట్‌గా గెలుచుకో!

‘‘కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోండి లేదంటే ఉద్యోగం పోతుంది.. జీతం కట్‌!’’ అంటూ పలుదేశాలు కఠినమైన నియమ నిబంధనలను ప్రవేశపెట్టాయి. బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ ,ఫిజి, ఇటలీ వంటి దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, టీకా పట్ల అవగాహన తీసుకొచ్చేందుకు ఇదే పద్ధతిని అనుసరించాయి.

Published : 11 Nov 2021 15:09 IST

మహారాష్ర్టలోని చంద్రపుర్‌లో మున్సిపల్ అధికారుల విభిన్న ఆలోచన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోండి. లేదంటే ఉద్యోగం పోతుంది’’ అంటూ పలు దేశాలు ఇప్పటికే కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. మహారాష్ర్టలో ఠాణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా సరిగ్గా ఇదే తరహా ఆంక్షలను అమలు చేస్తోంది. కానీ, మహారాష్ర్టలోని చంద్రాపుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాత్రం వీటికి భిన్నంగా స్పందించింది. అక్కడి మేయర్‌ రాఖీ సంజయ్ కంచరల్వార్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొన్నారు.  టీకాలు తీసుకొన్న పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ టీకా వేయించుకొన్న వారి పేర్లను లక్కీడ్రా తీసి విజేతలకు  బహుమతులను ఇవ్వనున్నారు.
నవంబరు 12- 24 వరకూ టీకా తీసుకునే వారికి వీటిని గెలుచుకునే అవకాశం ఉన్నట్లు బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పౌరులు తమ సమీపంలోని ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకోవాలని కమిషనర్ రాజేష్ మోహితే విజ్ఞప్తి చేశారు. ఇక లక్కీ డ్రాలో తొలి బహుమతిగా రిఫ్రిజిరేటర్‌, రెండో బహుమతిగా వాషింగ్‌ మిషన్‌, మూడో బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ ఇస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు మరో 10 మందికి మిక్సర్-గ్రైండర్లను ప్రోత్సాహక బహుమతులుగా ఇవ్వనున్నారు.

అత్యవసర సేవల విభాగంలో పని చేసేవారితో పాటు దుకాణదారులు కచ్చితంగా ఒక డోస్‌ టీకా తీసుకున్నట్లు సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుందని.. లేదంటే వారిని నగరంలోని మార్కెట్‌ల్లోకి అనుమతించమని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 30లోపు వారు టీకా రెండుడోసులను కచ్చితంగా తీసుకోవాలి. అలాగే బయటికి వచ్చేటప్పుడు వారి వెంట వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ వెంట తెచ్చుకోవాలని కమిషనర్‌ మోహితే విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని