
Gold - River: నదిలో దొరికే బంగారమా?!
(ప్రతీకాత్మక చిత్రం)
ఇంటర్నెట్ డెస్క్: నదుల్లో అనేక రకాల చేపలు కనిపిస్తాయి. వాటిలోకి దిగి వెతికితే ప్రవాహంలో కొట్టుకొచ్చిన అనేక వస్తువులు, అరుదైన రాళ్లు, రప్పలు దర్శనమిస్తాయి. కానీ థాయ్‌లాండ్‌లోని ఓ నదిలో వెతికితే బంగారం లభిస్తుందట. ఆశ్చర్యంగా ఉంది కదా! అయితే, ఇది చదివేయండి!
మలేషియాతో సరిహద్దును పంచుకునే దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఫు కవో థాంగ్ అనే ప్రాంతంలో బంగారు గనులు ఎక్కువగా ఉన్నాయి. చాలాకాలంగా ఇక్కడ బంగారాన్ని వెలికి తీస్తున్నారు. అటువైపు నుంచే ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని గోల్డ్ రివర్ అంటారు. అయితే, కరోనా కారణంగా మైనింగ్‌లో పనులు నిలిచిపోయాయి. మరోవైపు ఆ నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు కరోనా సంక్షోభంలో ఉపాధి కోల్పోయి, దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఖాళీ సమయాన్ని ఎందుకు వృథా చేయాలని భావించిన అక్కడి గ్రామాల ప్రజలు గోల్డ్ రివర్‌ను జల్లెడ పట్టడం ప్రారంభించారు.
బంగారు గనుల్లో తొవ్వకాలు జరిపినప్పుడు చిన్న చిన్న బంగారు ముక్కలు, రేణువులు ఎగిరి ఈ నదిలోని మట్టిలో కలిసిపోయి ప్రవాహంలో కొట్టుకొచ్చే అవకాశముంది. అందుకే అక్కడి ప్రజలు నది అడుగు భాగాన ఉండే మట్టిని జల్లెడ పడుతున్నారు. అయితే రోజంతా కష్టపడి వెతికితే చాలా తక్కువ మొత్తంలోనే బంగారం లభిస్తుందని వాపోతున్నారు. దొరికిన బంగారాన్ని అమ్మేసి పొట్ట నింపుకుంటున్నామని, కరోనా వేళ ఉపాధి కోల్పోయిన తమకు ఇది కాస్త ఆదాయ వనరుగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు.