Manipur: ఔరా సాహస వీరా.. నిమిషంలో 109 పుష్‌-అప్‌లు

మనిషనుకుంటే కానిది ఏముంటుందని మణిపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు నిరూపించాడు. నిమిషంలో అత్యధిక పుష్-అప్‌లు..

Published : 24 Jan 2022 01:53 IST

ఇంఫాల్‌: పది నిమిషాల్లో 100 పుష్‌-అప్‌లు అంటే కొద్దిగా కష్టమైనా చాలా మంది చేసేస్తామంటారు..  అది ఐదు నిమిషాల్లో చేయాలంటే.. కాస్త వెనకడుగు వేయక మానరు. ఇక నిమిషంలో ఈ సాహసం పూర్తి చేయాలంటే.. అమ్మో ఇది మనతో కాదులే అని చేతులెత్తేస్తారు. కానీ, మణిపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు అలా అనుకోలేదు. మనిషి తలుచుకుంటే కానిది ఏముంటుందని నిరూపించాడు. ఆయువే ఆశయ సాధనంగా నిమిషంలో 109 పుష్‌-అప్‌లు చేసి ఔరా సాహస వీరా అనిపించాడు.

మణిపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు నిరంజోయ్ సింగ్ నిమిషంలో అత్యధిక పుష్-అప్‌లు (ఫింగర్స్ టిప్స్) చేసి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అంతకుముందే రెండుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన నిరంజోయ్.. నిమిషంలో 109 పుష్-అప్‌లు చేసి తన పాత రికార్డు (105)ను బద్దలు కొట్టాడు. ఇంఫాల్‌లోని అజ్టెక్ ఫైట్ స్టూడియోలో అజ్టెక్స్ స్పోర్ట్స్ మణిపూర్ నిర్వాహకులు గతవారం చేపట్టిన వేడుకలో నిరంజోయ్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

ఈ మేరకు మణిపూర్‌ యువకుడికి అభినందనలు తెలుపుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు. ‘నమ్మశక్యం కాని ఈ మణిపురి యువకుడి శక్తిని చూడటం ఆశ్చర్యంగా ఉంది. నిమిషంలో అత్యధిక పుష్-అప్‌లు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన నిరంజోయ్ విజయానికి గర్వపడుతున్నా’ అని రిజిజు అభినందించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని