Gujarat: ఒక్కరోజు కలెక్టర్‌గా 11 ఏళ్ల బాలిక..!

గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా అసోడియా 7వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది

Published : 20 Sep 2021 01:41 IST

అహ్మదాబాద్‌: ఆ బాలిక కలెక్టర్‌ కావాలనుకుంది. కానీ.. ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో ఏం చేయలేని దుస్థితి. కానీ, చివరకు ఆ 11 ఏళ్ల బాలిక కల నెరవేరింది. ఒక్కరోజు అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా అసోడియా 7వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. గత నెలలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ క్రమంలో మెరుగవుతుందనుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. చిన్నారి కలను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలుసుకున్నారు. చొరవ తీసుకుని చిన్నారి గురించి అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్ సాంగ్లేకు వివరించారు. చిన్నారి కలను సాకారం చేయాలని కోరారు. దీంతో చిన్నారిని ఒక్కరోజు కలెక్టర్‌ చేసేందుకు ఆయన అంగీకరించారు.

‘ఫ్లోరా గురించి తెలిశాక, వారి తల్లిదండ్రులను సంప్రదించాం. ఒకరోజు కలెక్టర్‌ విషయమై అంగీకారం కోరాం. కానీ, శస్త్రచికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పి దానికి వారు విముఖత వ్యక్తం చేశారు. చివరకు ఎలాగోలా వారిని ఒప్పించి ఆమె కలను సాకారం చేశాం’ అని కలెక్టర్‌ సందీప్‌ సాంగ్లే పేర్కొన్నారు. అంతేకాకుండా చిన్నారి పుట్టినరోజు (సెప్టెంబరు 25) వేడుకలను కూడా ముందుగానే జరిపారు. కాగా.. ఫ్లోరా చదువులో ముందుండేదని తల్లిదండ్రులు చెప్పారు. కలెక్టర్‌ అవ్వాలనుకున్న తన కలను నెరవేర్చినందుకు సంతోషిస్తూ.. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని