మీకు 50ఏళ్లు వచ్చాయా? బరువు మరీ చేటు

అధిక బరువును తగ్గించుకోవటం ఏ వయసులోనైనా మంచిదే. మధ్యవయసులో.. ముఖ్యంగా 50ల్లోకి అడుగిడిన తర్వాత బరువు

Updated : 11 Feb 2021 18:47 IST

అధిక బరువును తగ్గించుకోవటం ఏ వయసులోనైనా మంచిదే. మధ్యవయసులో.. ముఖ్యంగా 50ల్లోకి అడుగిడిన తర్వాత బరువు తగ్గటం ఇంకా మంచిది. అధిక బరువు మహిళలకు ఇది మరింత ముఖ్యం. ఇందుకు సమంజసమైన కారణాలే ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. మతిమరుపు ముప్పు తగ్గుముఖం

యాబై ఏళ్ల వయసులో ఊబకాయం గలవారికి తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా తలెత్తే అవకాశం ఎక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదే 60, 70ల్లోనైతే అంత ముప్పేమీ కనిపించటం లేదు. శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఎక్కువగా గలవారికి.. ప్రత్యేకించి బొజ్జ గలవారికి మతిమరుపు ముప్పు 30% వరకు అధికంగా ఉంటుండటం గమనార్హం. కడుపు వద్ద పోగుపడే కొవ్వు వాపు ప్రక్రియను, ఇన్సులిన్‌ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లు, రసాయనాలు విడుదలయ్యేలా చేస్తుంది. ఇవి మెదడుకూ హాని చేస్తాయి.

2. వేడి ఆవిర్లు తగ్గుతాయి

నెలసరి నిలిచిన (మెనోపాజ్‌) మహిళలు తరచూ వేడి ఆవిర్లతో సతమతమవుతుంటారు. వీటితో రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడేవారు ఎందరో. వీపరీతంగా చెమట్లు కూడా పడుతుంటాయి. యాభై ఏళ్లు దాటాక వేడి ఆవిర్లు రావటం మరింత ఎక్కువగానూ చూస్తుంటాం. ఇందుకు అధిక బరువూ దోహదం చేస్తుంది. ఒంట్లోంచి వేడి బయటకు వెళ్లకుండా కొవ్వు అడ్డుకుంటుంది మరి. ఇది ఈస్ట్రోజెన్‌ హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. ఈస్ట్రడియోల్‌, ఈస్ట్రోన్‌ వంటి ఈస్ట్రోజెన్‌ హార్మోన్లు కొవ్వు కణజాలంలోనే నిల్వ ఉంటాయి. కొవ్వు శాతం పెరిగిన కొద్దీ ఒంట్లో వీటి స్థాయులూ ఎక్కువవుతాయి. నిజానికి ఈస్ట్రడియోల్‌ వేడి ఆవిర్లు తగ్గటానికి తోడ్పడుతుంది గానీ ఈస్ట్రోన్‌ దీని ప్రభావాలను అడ్డుకుంటుంది. బరువు తగ్గటం వల్ల ఈస్ట్రోన్‌ తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో ఈస్ట్రడియోల్‌ స్థాయులు పెరిగి మెనోపాజ్‌ లక్షణాలు తగ్గుముఖం పడతాయి.

3. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

వయసు పెరుగుతున్నకొద్దీ తలెత్తే సమస్యల్లో మోకాళ్ల నొప్పులు ఒకటి. మన కీళ్ల మధ్యన రబ్బరులాంటి మృదులాస్థి ఉంటుంది. ఇది కీళ్లు ఒకదాంతో మరోటి రాసుకోకుండా చూస్తుంది. వయసు మీద పడుతున్నకొద్దీ ఇది అరిగిపోతుంటుంది. దీంతో శరీర బరువును మోసే మోకాలి కీళ్ల వాపు, బిగుసుకుపోవటం, నొప్పి ఇబ్బంది పెడతాయి. బరువు ఎక్కువగా గలవారిలో మృదులాస్థి ఇంకాస్త త్వరగానూ అరిగిపోతుంది. కీళ్ల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. నొప్పీ ఎక్కువవుతుంది.

4. రొమ్ము క్యాన్సర్‌ ముప్పు దూరం

ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్లు కొవ్వులో నిల్వ ఉండటం వల్ల 50 ఏళ్లు పైబడిన మహిళల్లో హార్మోన్లతో ముడిపడిన క్యాన్సర్లు తలెత్తే ప్రమాదముంది. రొమ్ముక్యాన్సర్‌కు.. ముఖ్యంగా హార్మోన్‌ గ్రాహకం పాజిటివ్‌తో ముడిపడిన క్యాన్సర్‌కూ ఊబకాయానికీ సంబంధం ఉంటుండటం గమనార్హం. బరువు తగ్గటం ద్వారా దీని ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని