Bihar: రైల్వేస్టేషనే ఆ విద్యార్థులకు లైబ్రరీ

రైల్వేస్టేషన్‌ అంటే నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. కానీ, బిహార్‌లోని ససారామ్‌ రైల్వేస్టేషన్‌ మాత్రం

Published : 08 Oct 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వేస్టేషన్‌ అంటే నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. కానీ, బిహార్‌లోని ససారామ్‌ రైల్వేస్టేషన్‌ మాత్రం చదువుకొనే విద్యార్థులతో నిండిపోతోంది. దాన్నే వారు లైబ్రరీలా ఉపయోగించుకొని సివిల్స్ లాంటి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. గత కొన్నేళ్లుగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమై ఉన్నత ఉద్యోగాలను సాధించారు. తాజాగా అవనీష్‌ శరణ్‌ అనే ఐఏఎస్‌ అధికారి రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు చదువుకుంటున్న ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బిహార్‌ రాష్ట్రంలోని రోహతాస్‌ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. ఇప్పటికీ అక్కడ చాలా గ్రామాలకు కరెంటు సదుపాయం లేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ససారామ్‌లో ఒక్క రైల్వే స్టేషన్‌లో తప్ప చుట్టుపక్కల గ్రామాలకు కరెంట్‌ ఉండదు. రైల్వే స్టేషన్‌లో మాత్రమే 24 గంటల కరెంట్ సదుపాయం ఉంటుంది. ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుపై ఆసక్తితో అక్కడికి వచ్చి చదువుకుంటారు. ససారామ్‌ రైల్వే స్టేషనే అక్కడి పేద విద్యార్థుల పాలిట కోచింగ్ సెంటర్‌లా మారింది. 2002 నుంచి ఇలా విద్యార్థులంతా కలిసి రైల్వే స్టేషన్‌లో లైట్ల కింద పోటీపరీక్షలకు సిద్ధమవుతూ వస్తున్నారు.

ప్రస్తుతం అక్కడికి సుదూర ప్రాంతాల నుంచి రోజూ దాదాపు 1,200 మంది విద్యార్థులు వచ్చి ప్లాట్‌ఫారమ్‌పై చదువుకుంటున్నారు. అంతేకాకుండా సీనియర్ విద్యార్థులు జూనియర్లకు కోచింగ్ కూడా అందిస్తారు. రైల్వే అధికారులు కూడా వీరిని ప్రోత్సహిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు సైతం అందించి చదువుకోవడానికి సహాయం చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రుళ్లు అక్కడే పడుకుంటారని ఐఏఎస్‌ అధికారి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కొందరు ఆవేదన వెలిబుచ్చారు. మరికొందరు విద్యార్థులు బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని