గూగుల్‌ను నమ్ముకుంటే.. వధువే మారిపోయింది

గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని, పెళ్లింటి చిరునామా వెతుక్కుంటూ వెళ్లిన వరుడు.. అదే ప్రాంతంలోని మరో వధువు చెంతకు చేరుకున్నాడు.

Published : 11 Apr 2021 07:45 IST


జకార్తా: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని, పెళ్లింటి చిరునామా వెతుక్కుంటూ వెళ్లిన వరుడు.. అదే ప్రాంతంలోని మరో వధువు చెంతకు చేరుకున్నాడు. ఇక పెళ్లే తరవాయి అనుకునేంతలోనే తాము వచ్చింది వేరొకరి ఇంటికని తెలుసుకొని నాలుక్కరుచుకున్నారు. ఇండోనేసియాలో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సెంట్రల్‌ జావాలోని లొసారి హామ్లెట్‌లో వధువు ఇంటికి బయలుదేరిన వరుడు, అతని బంధువులు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు. 

అది అక్కడికి సమీపంలోనే ఉన్న జెంగ్‌కోల్‌ హామ్లెట్‌ అనే మరో గ్రామానికి తీసుకెళ్లింది. అక్కడా ఓ పెళ్లిమండపం, హడావుడి ఉండటంతో సరాసరి అందులోకి వెళ్లారు. నిజానికి అక్కడ మారియా అనే అమ్మాయికి బుర్హాన్‌తో అనే యువకుడితో నిశ్చితార్థం జరగాలి. వారంతా బుర్హాన్‌ బంధువుల కోసం చూస్తుండగా.. ‘‘గూగుల్‌ బృందం’’ వచ్చేసింది. కాసేపు అంతా సవ్యంగానే జరుగుతోందని అందరూ అనుకున్నారు. అయితే ఏకంగా పెళ్లిదుస్తులు, సరంజామాతో వచ్చిన వారిని చూసి మారియా అప్రమత్తమైంది. వచ్చినవారు తన కోసం వచ్చిన వారు కాదని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. వచ్చినవారు కూడా తాము మరోచోటకు వచ్చినట్టు గుర్తించారు. అక్కడినుంచి బయలుదేరి అసలు పెళ్లిమండపానికి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని