హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారి వెంబడి రెచ్చిపోతున్న స్థిరాస్తి వ్యాపారులు!

హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారి వెంబడి స్థిరాస్తి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. లేఅవుట్లు వేయడంలో నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తున్నారు.

Published : 18 Nov 2021 01:57 IST

హైదరాబాద్: హైదరాబాద్ -బెంగళూరు జాతీయ రహదారి వెంబడి స్థిరాస్తి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. లేఅవుట్లు వేయడంలో నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తున్నారు. జడ్చర్ల బూరెడ్డిపల్లి శివారులో.. ఏకంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సోరంగంపైనే వెంచరు వేసి వ్యాపారం చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 16వ ప్యాకేజీలో భాగంగా జడ్చర్ల పురపాలికలోని బూరెడ్డిపల్లి వద్ద సర్వే నెంబర్లు 56, 57, 58, 102-11లో నుంచి రెండు సొరంగాలు వెళుతున్నాయి. ఈ సొరంగాల నిర్మాణం కోసం. ఆ సర్వే నెంబర్లలోని 40 మంది వద్ద భూసేకరణ చేశారు. దీంతో ఈ ప్రాంతమంతా ప్రభుత్వ అధీనంలోకి వెళ్లింది. తాజాగా ఆ సొరంగాల పైనుంచి ఓ సంస్థ వెంచర్‌ వేసింది. ఏకంగా 60 ఎకరాల్లో.. 628 ప్లాట్లతో స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్‌పై రోడ్ల నిర్మాణం చేపట్టారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఇళ్లు నిర్మించుకుంటే బోర్లు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ లేఅవుట్ల నుంచే సొరంగాలు వెళ్తుండటంతో.. బోర్లు వేసే సమయంలో టన్నెల్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వెంచర్‌ యజమానుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వెంచర్‌లోనే ఉన్న మూడు ఎకరాల మురుగు కుంటను సైతం లైఅవుట్‌లో కలిపేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులకు గతంలో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వివరాలు చూసిన తర్వాతే అనుమతులిచ్చారని, వెంచర్‌ యజమానులు అక్రమాలకు పాల్పడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని