త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్‌రావు

మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.

Updated : 26 Mar 2021 14:02 IST

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి  హరీశ్‌రావు తెలిపారు. గురువారం తెలంగాణ శాసనసభ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు,  మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కనీస పింఛను రూ.50వేలు, గరిష్ఠ పింఛను రూ.70వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచుతూ ప్రవేశ పెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ...‘‘మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేశాం. మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లు. పీఆర్సీ కమిషన్‌ నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం. వయోపరిమితి పెంపు వల్ల ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేస్తాం. రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం’’ అని హరీశ్‌ రావు తెలిపారు.

కొత్తగా 18 జిల్లాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు
రాష్ట్రంలో కొత్తగా 18 జిల్లాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసనసభలో ప్రకటించారు. ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. పేదలందరికీ ఉచిత రోగ నిర్థారణ పరీక్షలు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌, సిద్దిపేటలో డయాగ్నస్టిక్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని