Updated : 04/11/2020 19:08 IST

ఎవరు గెలిచినా భారత్‌తో సత్సంబంధాలే

అమెరికా అధ్యక్ష ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడం ఎన్నికల ఫలితాల్లో మార్పునకు నాంది పలుకుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జేఎల్ఎన్‌రావు అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లోనూ ఈ విషయం మరింత స్పష్టమవుతోందని చెప్పారు. కొవిడ్‌పై ట్రంప్‌ స్పందించిన తీరు ఫలితాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ‘ఈటీవీ’ ప్రతినిధి నిర్వహించిన ముఖాముఖిలో ఓయూ ప్రొఫెసర్‌ జెఎల్‌ఎన్‌ రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌, బైడెన్‌లలో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పోటీలో బైడెన్‌ స్పష్టమైన ఆదిక్యంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సరళిని మీరు ఏవిధంగా విశ్లేషిస్తారు?

జేఎల్ఎన్‌ రావు: ప్రస్తుతం బైడెన్‌ ట్రంప్‌తో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు. కానీ చివరి వరకు ఎలక్ర్టల్‌ కాలేజి ఓట్లలో ఎవరికి మెజార్టీ వస్తుందో అప్పుడు మాత్రమే ఫలితం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ప్రస్తుత సరళిని పరిశీలిస్తే బైడెన్‌ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. 

విజయానికి కావాల్సిన 270 ఎలక్ర్టోరల్‌ ఓట్లకు బైడెన్‌ చాలా దగ్గరగా ఉన్నారు. ఫలితాలు రావడంలో ఆలస్యమయ్యే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి. బైడెన్‌ గెలుపు అంత సునాయాసం కావచ్చా?

జేఎల్‌ఎన్‌ రావు: కొన్ని స్టేట్స్‌ను సింగిల్‌ స్టేట్స్‌ను అంటుంటారు. ఆ స్టేట్స్‌లో ట్రంప్‌కు, బైడెన్‌కు చాలా వ్యత్యాసం ఉన్నప్పుడు ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఫలితం ఈ రాత్రి వరకు వెలువడకపోవచ్చు. రేపు కానీ ఆ తరువాతి రోజు కానీ రావచ్చు. ట్రంప్‌ చెప్పినట్లు తక్కువ వ్యత్యాసం ఉండి ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తీర్పు రావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు.

ఫలితాలకు సంబంధించి ఎటువంటి విభేదాలొచ్చినా తమ లీగల్‌ ఆర్మీలతో కోర్టును ఆశ్రయించేందుకు రెండు పార్టీలు ముందస్తుగానే సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ వ్యత్యాసం అధికంగా ఉంటే ట్రంప్‌ ఏయే అంశాల ప్రాతిపదికన కోర్టును ఆశ్రయించవచ్చు? 

జేఎల్ఎన్‌ రావు: ట్రంప్‌ ముఖ్యంగా మెయిలింగ్‌ ఓట్లను ఛాలెంజ్‌ చేస్తానన్నారు. వాటిలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని 3 నెలల క్రితమే ట్రంప్‌ ప్రకటించారు. ఒకవేళ ట్రంప్‌ ఈ విషయంపై కోర్టుకు వెళ్తే ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.  

ప్రీపోల్స్‌, సర్వేలు బైడెన్‌ ఆధిక్యంతో విజయం సాధిస్తారని ముందుగానే తెలిపాయి. మరోవైపు కమలాహ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవి ఇస్తామని ప్రతిపాదించడంతో ఏయే వర్గాలు బైడెన్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

జేఎల్ఎన్‌ రావు: కమలా హ్యారిస్‌ ఆఫ్రికన్‌ అమెరికన్‌. ఆమె తల్లి భారత సంతతికి చెందినవారు. అమెరికాలో ఉన్న నల్లజాతి వారు ట్రంప్‌ అవలంబించిన విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగిత అత్యధిక స్థాయిలో ఉంది. దీంతో వారంతా బైడెన్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

డెమోక్రట్లకు, రిపబ్లికన్లకు కంచుకోటలైన కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ  ఈసారి మాత్రం వారికి అంతగా బలం లేని స్థానాల్లో కూడా ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత రాష్ట్రమైన న్యూయార్క్‌లో కూడా ట్రంప్‌ ఓడిపోవడం జరిగింది. ఒహయో, మిగతా పెద్ద రాష్ట్రాల్లో ట్రంప్‌ ముందున్నారు. గణాంకాలు స్వల్పంగా మారినట్లు మనకు కనిపిస్తోంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? 

జేఎల్ఎన్‌రావు: అమెరికా మొత్తం దేశాన్ని తీసుకున్నట్లయితే న్యూయార్క్‌ ఫైనాన్షియల్‌ క్యాపిటల్‌. కరోనా సమయంలో ట్రంప్‌ చర్యలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. నిరుద్యోగిత పెరిగింది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఆ పరిస్థితుల్లో ట్రంప్‌ స్వరాష్ట్రమైన న్యూయార్క్‌లో కూడా ఓడిపోవడం జరిగింది. 


అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్క్‌ స్టడీ సెంటర్‌ డైరెక్టర్‌, సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ శ్రీమన్నారాయణతో ‘ఈటీవీ’ ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. ఇందులో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాల సరళిని మీరు ఏవిధంగా అభివర్ణిస్తారు?

శ్రీమన్నారాయణ:  బైడెన్‌, ట్రంప్‌ మధ్య పోరు ఉత్కంఠగా సాగుతోంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చివరి వరకు చెప్పలేని పరిస్థితి ఉంది.

గత ఎన్నికల్లో హిల్లరీకి, ట్రంప్‌కు ఏ రకమైన పరిస్థితి వచ్చిందో ఇప్పుడు బైడెన్‌కు, ట్రంప్‌కు అదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ముందు హిల్లరీ గెలుస్తుంది అనుకున్నాం. ఈసారి అన్ని సర్వేలు ముందస్తుగానే బైడెన్‌కు అనుకూలంగా వచ్చాయి. కానీ ఇప్పుడు ఫలితాలు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటారు? 

శ్రీమన్నారాయణ: బైడెన్‌ పాలసీలు అన్ని చాలా సమతూకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే విధంగా ఆయన విధానం ఉంది. బైడెన్‌ పన్నుల వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళిక రచించారు. 20శాతం ధనికుల మీదే పన్నుల వ్యవస్థ ప్రభావం చూపుతోందని తెలిపారు. మధ్యతరగతి వారిని ఇబ్బంది పెట్టకుండా మంచి పన్నుల వ్యవస్థను ప్రతిపాదించారు. దీంతో ప్రపంచ వ్యాప్త పోల్స్‌లో బైడెన్‌ గెలుస్తాడని వినిపించింది. గత కొన్ని రోజులుగా ట్రంప్‌ నిర్వహించిన ర్యాలీలు, ప్రసంగాల్లో బైడెన్‌ కుమారుడికి చైనాలో వ్యాపారాలున్నట్లు తెలపడం, బైడెన్‌ విధానం అమెరికాపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పడంలో ట్రంప్‌ విజయం సాధించాడు. చైనా, పాకిస్థాన్‌లతో బైడెన్‌ శాంతియుతంగా వెళ్లాలని చెప్పారు. దీంతో సర్వేల్లో ప్రజలు బైడెన్‌ వైపు మొగ్గు చూపారు. కానీ చైనావైపు సమతూకంగా, శాంతియుతంగా వెళ్లడం సరికాదని ట్రంప్‌ ప్రజలకు వివరించారు. దీనికి తోడు కరోనా ప్రభావంతో చైనాపై ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. ఇవన్నీ ట్రంప్‌కు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. బైడెన్‌ చెప్పిన హెల్త్‌ ఇన్యూరెన్స్‌, మిగతా విషయాలు, హామీల్లో వేటికి తగ్గకుండా ట్రంప్‌ ప్రణాళికలు తెలిపారు. తన పరిపాలనలో ట్రంప్‌ నిరుద్యోగితను తగ్గించారు. కానీ కరోనా కారణంగా తిరిగి నిరుద్యోగిత రేటు పెరిగింది.  

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వారి ప్రభావం ఎలా ఉంది. కమలా హ్యారిస్‌ ప్రభావం ఎలా ఉండబోతోంది? 

శ్రీమన్నారాయణ: కమలా హ్యారిస్‌ను తీసుకోవడంతో భారతీయ ఓటర్ల విషయంలో బైడెన్‌కు సానుకూల ప్రభావం ఉంటుంది. బైడెన్‌ వస్తే బాగుంటుందనే అభిప్రాయం భారతీయుల్లో ఉంది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలు 

ట్రంప్‌, బైడెన్‌లలో ఎవరు గెలిస్తే భారత్‌తో దౌత్యపరంగా సత్సంబంధాలుంటాయి?

శ్రీమన్నారాయణ: ఎవరు గెలిచినా భారత్‌తో సత్సంబంధాలుంటాయి. బైడెన్‌ వచ్చినట్లయితే మరింత ఎక్కువ సత్సంబంధాలుండే అవకాశం ఉంటుంది. సరిహద్దు వివాదాల్లో ట్రంప్‌ భారతదేశానికి వెనక ఉండి మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. బైడెన్‌ సరిహద్దు వివాదాలను తగ్గించి అభివృద్ధిపై దృష్టి సారించమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బైడెన్‌ చైనా, పాక్‌లతో సత్సంబంధాలు నడపాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని