Health: హెర్నియాకు శస్త్రచికిత్సే మార్గమా?

హెర్నియా, గిలక, ఉబ్బు ఇలా పేరు ఏదైనా.. సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు.. చర్మం కింద నుంచి బయటకు తోసుకు రావడం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన..

Published : 06 Nov 2021 18:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హెర్నియా, గిలక, ఉబ్బు ఇలా పేరు ఏదైనా.. సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు.. చర్మం కింద నుంచి బయటకు తోసుకు రావడం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకురావడాన్ని హెర్నియా అని పిలుస్తారు. చర్మం, కండరాలు బలహీనంగా ఉన్న బాగాల్లో సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావడానికి అధిక బరువు నుంచి ఆపరేషన్ల వరకు చాలా కారణాలు కనిపిస్తాయి.

మొదట్లో నొప్పి లేకపోయినా..

హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం, కణజాలం ఉబ్బినట్లు కనిపిస్తుంది. హెర్నియాలో చాలా రకాలు ఉన్నాయి. చాలా మందిలో ఇంగ్వైనల్‌ హెర్నియా కనిపిస్తుంది. ఏ రకమైన హెర్నియా అయినా, నిలబడినప్పుడు దగ్గినప్పుడు కనిపిస్తూ..పడుకున్నప్పుడు, చేతితో నెడుతున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా.. చర్మం అడుగున పడిన రంద్రం పరిమాణం పెరుగుతున్న కొద్దీ నొప్పి పెరుగుతుంది.

మద్యపానంతో మరింత కష్టం

హెర్నియా ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగంలో కనిపిస్తుంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలుక ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తినప్పుడు ఉబ్బు తిరిగి లోపలికి వెళ్లిపోతుంది. ఎక్కువగా బరువులు ఎత్తే వారిలోనూ, మద్యపానం చేసే వారిలోనూ స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నిర్లక్ష్యం వద్దు

హెర్నియాతో బాధపడుతున్నప్పటికీ చాలా మంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. తోసేస్తే లోపలికి వెళ్లిపోతోంది కదా అని, పెద్దగా పట్టించుకోరు.పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో ఆ వాపును లోపలికి బిగించి కడుతుంటారు. నిజానికి అలాంటి ప్రయాత్నాల వల్ల చర్మం మరింతగా దెబ్బతిని వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం.

అధునాతన పద్ధతులు

హెర్నియాకు ఒకప్పుడు పెద్దగా కోతపెట్టి శస్త్ర చికిత్స చేసేవాళ్లు. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ, మెష్‌ప్లాస్టీ విధానంలో సర్జరీ చేస్తున్నారు. ల్యాప్రోస్కోపీ టెక్నిక్‌లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకొని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయడంతోపాటు సాగిన చర్మం పొరలన్నింటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్‌ను ల్యాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్లాక మెష్‌ను పరుస్తారు. మెష్‌తో రంద్రాన్ని మూసివేశాక కుట్లు వేయడం లేదా పిన్స్‌ కొడతారు.

హెర్నియా తిరగబెట్టొచ్చు

ఒకసారి సర్జరీ చేసిన హెర్నియా తిరిగి వస్తుందని చాలా మంది అనుకుంటారు. దీనికి ప్రధాన కారణం సర్జరీ టెక్నిక్‌ను సరిగా పాటించకపోవడమే. ఇంగ్వైనల్‌ హెర్నియా సర్జరీలో మెష్‌ను సరిగ్గా అమర్చకపోయినా, కుట్లు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా.. హెర్నియా తిరగబెట్టవచ్చు. సరైన ప్రదేశంలో, సరైన పద్ధతిలో మెష్‌ను అమర్చకపోతే హెర్నియా మళ్లీ ఏర్పడుతుంది. ఆపరేషన్‌ తర్వాత జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా.. మళ్లీ వచ్చే అవకాశం ఉంది. తిరిగి రాకుండా ఉండాలంటే బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్‌ సమస్య ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. ధూమపానం లాంటి అలవాట్లు మానుకోవాలి. కాన్పుతర్వాత, సిజేరియన్‌ తర్వాత పొత్తికడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని