Karnataka: గుడిలోకి ప్రవేశించాడని.. దళిత కుటుంబానికి రూ. 23వేల జరిమానా!

ఆలయంలోకి ప్రవేశించాడని ఓ దళిత బాలుడి కుటుంబంపై అగ్ర కులాల వారు మండిపడ్డారు. ఆలయం అపవిత్రమైందని పేర్కొంటూ.....

Published : 22 Sep 2021 02:11 IST

బెంగళూరు: శాస్త్రసాంకేతిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతూ, అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న భారత్‌లో ఇంకా కులం, మతం పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉంది. తాగాజా ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగుచూసింది. ఆలయంలోకి ప్రవేశించాడని ఓ దళిత బాలుడి కుటుంబంపై అగ్ర కులాల వారు మండిపడ్డారు. ఆలయం అపవిత్రమైందని పేర్కొంటూ.. గుడిని శుభ్రం చేసేందుకు రూ.23 వేల జరిమానా విధించారు. దీంతో ఈ విషయం కర్ణాటక వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కొప్పల్‌ జిల్లా మియపురా గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తి తన పుట్టిన రోజును పురస్కరించుకొని రెండేళ్ల కుమారుడితో కలిసి స్థానిక హనుమాన్‌ ఆలయానికి వెళ్లాడు. అయితే దళితులకు ఆ ఆలయంలోకి ప్రవేశం లేదు. వారు బయట నిలుచుకునే దండం పెట్టుకొని వెళ్లిపోవాలి. కుమారుడితో కలిసి గుడి బయట దండం పెట్టుకుంటుండగా.. ఆ బాలుడు ఆలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్లి దేవుడికి దండం పెట్టి వెనక్కి వచ్చాడు.

అర్చకుల ద్వారా ఈ విషయం అగ్రకులాల పెద్దలకు తెలియడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. దళిత బాలుడు ఆలయంలోకి ప్రవేశించడంతో దేవాలయం అపవిత్రం అయ్యిందని గ్రామంలోని అగ్రవర్ణ ప్రజలు భావించారు. ఓ సమావేశం ఏర్పాటుచేసి అపవిత్రం అయిన ఆలయాన్ని పరిశుభ్రం చేయాలని.. అందుకు రూ.23 వేలు కట్టాలని బాలుడి తల్లిదండ్రులను ఆదేశించారు.

ఈ విషయం కాస్తా జిల్లా యంత్రాంగం దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ శాఖ, సంక్షేమ శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని వివాదంపై ఆరా తీశారు. గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటుచేసి వారికి అవగాహన కల్పించారు. ఇలాంటి చర్యలను తిరిగి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అగ్రవర్ణ ప్రజలను హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని