Gas cylinder Price: మరో రూ.100 పెరగనున్న వంటగ్యాస్‌ ధర!

దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయిలో పెరిగిపోతుండగా.. మళ్లీ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి......

Updated : 28 Oct 2021 05:07 IST

దిల్లీ: దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. అవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ.100 మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకోనున్నాయని.. ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ మేరకు పెంపు ఉంటుందని సమాచారం. ఈనెల 6న వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ.15 చొప్పున చమురు సంస్థలు పెంచాయి. జులై నుంచి అక్టోబరు 6 వరకు దీని ధర రూ.90 పెరిగింది.

ఎల్పీజీపై గతేడాది నుంచే కేంద్రం రాయితీలు తొలగించింది. అయితే పెట్రోల్, డీజిల్ మాదిరి ఎల్పీజీ ధరపై నియంత్రణ ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న వంటగ్యాస్ ధరల మధ్య అంతరాన్ని భరించేందుకు కూడా కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేకుంటే వినియోదారులపై మోపేందుకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 85 డాలర్లపైనే ట్రేడవుతోంది. కాగా ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో పెట్రోవాత కొనసాగే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని