Madhuri Yoga: మాధురి దీక్షిత్‌ ‘యోగా’ చిట్కాలు!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ తన అభిమానులకు యోగా చిట్కాలను చెప్పారు.

Published : 21 Jun 2021 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవడమే మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత శుభ్రతతోపాటు వ్యాయామం, యోగాపైనా శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలో నేడు (జూన్‌ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ తన అభిమానులకు యోగాపై మరింత ఆసక్తి కలిగిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానంవైపు వాళ్లని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా ప్రతి రోజూ ఓ యోగాసనాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. అభిమానులు కూడా అనుసరించాలని కోరుతున్నారు. కేవలం వీడియోను పోస్టు చేయడమే కాకుండా.. అది ఏ ఆసనం, దానివల్ల ఉపయోగాలేంటో కూడా ఆమె వివరిస్తున్నారు. యోగా తన జీవితంలో భాగమని, దానివల్లే ఇంత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నానని ఆమె అంటున్నారు.

1. భుజంగాసనం

నేలపై బోర్లా పడుకొని కటి భాగాన్ని నేలకు ఆనించి తలను ఏటవాలుగా పైకెత్తాలి. ఇలా కనీసం రెండు మూడు నిమిషాల పాటు ఉంచి మళ్లీ యథాస్థానానికి తీసుకురావాలి. ఈ యోగాసనం వల్ల వెన్నెముక దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా ఉదరభాగంలోని అవయవాలు ఉత్తేజితమవుతాయి. ఫలితంగా ఒత్తిడి, బద్దకం దూరమవుతాయి.

2. ధనురాసనం

ఈ ఆసనం వేసేటప్పుడు నేలపై బోర్లా పడుకొని,  రెండు కాళ్లను రెండు చేతులతో పట్టుకొని బాణం ఆకృతిలో వెనక్కి వంగాలి. ఇలా చేయడం వల్ల శరీరం ముందు భాగాలు దృఢంగా తయారవుతాయి.అంతేకాకుండా వీపు కండరాలు గట్ట్టిపడి శరీర ఆకృతి బాగుంటుంది.

3. ముద్రాసనం

యోగా మ్యాట్‌పై రెండు కాళ్లను వెనక్కి మడిచి, మోకాళ్లపై కూర్చొని తలను నేలకు ఆనించాలి. ఇలా చేయడం వల్ల జీర్ణావయవాలు  బలోపేతమవుతాయి. ఆహారం త్వరగా జీర్ణమై, మలబద్ధకం లాంటి సమస్యలు దరిచేరవు.

4 వృక్షాసనం

తొలుత రెండు కాళ్లను సమస్థితిలో ఉంచి నిలబడాలి. అనంతరం ఒక కాలు మీద నిలబడి తమను తాము సమతుల్యం చేసుకుంటూ పాదాన్ని మరోకాలు తొడపై అదిమి పట్టేలా ఉంచండి. తర్వాత రెండు చేతులను పైకెత్తి నమస్కారం చేసేలా ఉంచుకోవాలి. కాళ్లు, శరీర కింద భాగం కండరాలను ధృడంగా తయారు చేయడంలో ఈ భంగిమ ఎంతో దోహదం చేస్తుంది. అంతేకాకుండా నాడీసంబంధమైన నరాల అనుసంధానం మెరుగుపడుతుంది.

5. తులాసనం

ఈ ఆసనంలో భాగంగా కాళ్లు ఒకదానిమీద మరొకటి వేసి పద్మాసనంలో కూర్చోండి. తర్వాత రెండో చేతులను భూమికి అదిమిపట్టి శరీర భాగాన్నిపైకి లేపండి. ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి, కాళ్లనొప్పులు తగ్గడంతో పాటు చేతి కండరాలు బలోపేతమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని